Poacher: కామారెడ్డి జిల్లాలో బండరాళ్ల మధ్య తలకిందులుగా ఇరుక్కున్న వ్యక్తిని కాపాడిన అధికారులు

Poacher who stuck between rocks gets relief after 42 hours
  • కామారెడ్డి జిల్లాలో ఘటన
  • అటవీప్రాంతంలో వేటకు వెళ్లిన రాజు
  • బండల మధ్య పడిపోయిన సెల్ ఫోన్
  • తీసుకునే ప్రయత్నంలో ఇరుక్కుపోయిన వైనం
  • 42 గంటల పాటు నరకయాతన
కామారెడ్డి జిల్లాలో అటవీప్రాంతంలో వేటకు వెళ్లిన రాజు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోవడం తెలిసిందే. బండరాళ్ల మధ్య సెల్ ఫోన్ పడిపోవడంతో తీసుకునేందుకు యత్నించిన రాజు... తిరిగి బయటకు రాలేకపోయాడు. పెద్ద బండరాళ్ల మధ్య తలకిందులుగా చిక్కుకుపోయాడు. 

మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా, 42 గంటలపాటు అతడు నరకయాతన అనుభవించాడు. అయితే అధికారుల శ్రమ ఫలించి నేడు క్షేమంగా బయటపడ్డాడు. రాజును బయటికి తీసేందుకు రెండు జేసీబీలు, ఇతర యంత్రాలను ఉపయోగించారు. బండరాళ్లను తొలగించి రాజు ప్రాణాలను కాపాడారు. గాయాలపాలైన రాజును వెంటనే ఆసుపత్రికి తరలించారు.

వేటకు వెళ్లిన రాజు బండల మధ్య ఇరుక్కుపోగా, వేట నిషిద్ధం కావడంతో అతడిపై కేసు నమోదు చేస్తారని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని బయటికి పొక్కనివ్వలేదు. రాజు స్నేహితుడు అశోక్ బండల వద్దనే ఉండి మిత్రుడికి ధైర్యం చెప్పసాగాడు. 

అయితే, అతడిని బయటికి తీసేందుకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ప్రయత్నాలు విఫలం కావడంతో, ధైర్యం చేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, అటవీశాఖ సిబ్బంది, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో అతడిని సురక్షితంగా వెలికి తీశారు.
Poacher
Raju
Rocks
Kamareddy District
Telangana

More Telugu News