Sub Registrar: ఢిల్లీలో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగాలన్నీ మహిళలకే!
- ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కీలక ప్రతిపాదన
- ఢిల్లీ పరిధిలో 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
- మహిళా సబ్ రిజిస్ట్రార్లను నియమించాలని ప్రభుత్వానికి నిర్దేశం
ఆస్తులకు చట్టబద్ధత కల్పించాలన్నా, వివాహాలు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయాలన్నా ఆ విధులను సబ్ రిజిస్ట్రార్లు నిర్వర్తిస్తుంటారు. రెవెన్యూ వ్యవస్థలో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగాలు ఎంతో కీలకమైనవి.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక ప్రతిపాదన చేశారు. ఢిల్లీ పరిధిలో 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా, అన్నింటా మహిళలనే సబ్ రిజిస్ట్రార్లుగా నియమించాలని ఆయన ఢిల్లీ సీఎస్ నరేశ్ కుమార్ కు నిర్దేశించారు.
సబ్ రిజిస్ట్రార్లుగా మహిళలు ఉంటే అవినీతి తగ్గుతుందని, అధికారిక కార్యకలాపాల్లో తీవ్ర జాప్యానికి అడ్డుకట్ట పడుతుందని, ప్రజలపై వేధింపులు ఉండవని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. సాధారణ పౌరులతో ప్రభుత్వ సంబంధాల పరంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ముందు వరుసలో ఉంటాయని వివరించింది.