SBI: మరోసారి వడ్డీ రేట్లు పెంచిన ఎస్బీఐ
- రెపో రేటు పెంచిన రిజర్వ్ బ్యాంకు
- అక్టోబరు తర్వాత వడ్డీ రేట్లు సవరించిన ఎస్బీఐ
- పెంచిన వడ్డీ రేట్లు డిసెంబరు 13 నుంచి అమలు
- గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకే పెంచిన వడ్డీ రేట్ల వర్తింపు
ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజాగా వడ్డీ రేట్లు పెంచింది. అక్టోబరు తర్వాత ఫిక్స్ డ్ డిపాజిట్లపై మరోసారి వడ్డీ రేట్లు సవరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు పెంచిన నేపథ్యంలో ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. పెంచిన వడ్డీ రేట్లు డిసెంబరు 13 నుంచి అమల్లోకి వస్తాయి. తాజా వడ్డీ రేట్లు రూ.2 కోట్ల డిపాజిట్ల వరకే వర్తింపజేయనున్నారు.
ఎస్బీఐ... సాధారణ డిపాజిటర్లకు, సీనియర్ సిటిజెన్లకు వేర్వేరు వడ్డీ రేట్లు ప్రకటించింది.
7 నుంచి 45 రోజుల కాలవ్యవధికి సాధారణ డిపాజిటర్లకు వడ్డీ రేటు 3 శాతం కాగా, సీనియర్ సిటిజెన్లకు 3.50 శాతంగా పేర్కొంది. 46 రోజుల నుంచి 179 రోజులకు సాధారణ డిపాజిటర్లకు 4.50 శాతం, సీనియర్ సిటిజెన్లకు 5 శాతం... 180 రోజుల నుంచి 210 రోజుల వరకు కాలవ్యవధి కలిగిన డిపాజిట్లపై సాధారణ డిపాజిటర్లకు 5.25 శాతం, సీనియర్ సిటిజెన్లకు 5.75 శాతం... 211 రోజుల నుంచి ఒక ఏడాది లోపు కాలవ్యవధి కలిగిన డిపాజిట్లపై సాధారణ డిపాజిటర్లకు 5.75 శాతం, సీనియర్ సిటిజెన్లకు 6.25 శాతంగా పేర్కొంది.
ఒక ఏడాది నుంచి రెండేళ్ల లోపు కాలవ్యవధి కలిగిన డిపాజిట్లపై సాధారణ డిపాజిటర్లకు 6.75 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.25 శాతం... రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు కాలవ్యవధి కలిగిన డిపాజిట్లపై సాధారణ డిపాజిటర్లకు 6.75 శాతం, సీనియర్ సిటిజెన్ డిపాజిటర్లకు 7.25 శాతం... మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు కాలవ్యవధి కలిగిన డిపాజిట్లపై సాధారణ డిపాజిటర్లకు 6.25 శాతం, సీనియర్ సిటిజెన్ డిపాజిటర్లకు 6.75 శాతం... 5 నుంచి 10 ఏళ్ల కాలవ్యవధి కలిగిన డిపాజిట్లపై సాధారణ డిపాజిటర్లకు వడ్డీ రేటు 6.25 శాతం కాగా, సీనియర్ సిటిజెన్లకు 7.25 శాతం వడ్డీ లభించనుంది.