Delhi airport: ఢిల్లీలో విమానం ఎక్కాలంటే 3.5 గంటల ముందు రావాలట!
- దేశీయ విమాన ప్రయాణికులకు ఇండిగో సూచన
- చెకిన్, బోర్డింగ్ అధిక సమయం తీసుకుంటోందని ప్రకటన
- 7 కిలోలకు మించి బరువును క్యారీ చేయవద్దన్న ఎయిర్ లైన్స్
ఢిల్లీ విమానాశ్రయంలో రద్దీ సమస్యలు కొనసాగుతున్నాయి. దీంతో ప్రయాణికులు నిర్దేశిత సమయానికి 3.50 గంటలు ముందుగా రావాలని ఇండిగో ఎయిర్ లైన్స్ తన కస్టమర్లను కోరుతోంది. దేశీయ విమాన సర్వీసులకు సంబంధించి ఈ సూచన చేసింది. సెక్యూరిటీ తనిఖీలు సాఫీగా పూర్తి చేసుకునేందుకు ప్రయాణికుడు లేదా ప్రయాణికురాలు తమ వెంట 7 కిలోలకు మించని బ్యాగ్ తోనే రావాలని కోరింది.
‘‘ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో చెకిన్, బోర్డింగ్ సమయం అన్నది సాధారణ రోజులతో పోలిస్తే ఎక్కువ పడుతోంది‘‘ అని సూచన జారీ చేసింది. సౌకర్యం కోసం వెబ్ చెకిన్ పూర్తి చేసుకోవాలని సూచించింది. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో గేట్ నంబర్ 5, 6 ద్వారా టెర్మినల్ 3కి చేరుకుంటే, దగ్గరగా ఉంటుందని తెలిపింది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ విమానాశ్రయంలో రద్దీ పెరగడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో ఈ సమస్యను స్వయంగా తెలుసుకునేందుకు పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సోమవారం ఢిల్లీ విమానాశ్రయంలో పర్యటించడం గమనార్హం.