Yamini: తండ్రి ఖాతా నుంచి డబ్బు వాడుకుని, కిడ్నీ అమ్మి డబ్బు తిరిగివ్వాలనుకుంది... కానీ..!
- హైదరాబాదులో నర్సింగ్ చదువుతున్న యామిని
- యామిని స్వస్థలం గుంటూరు జిల్లా ఫిరంగిపురం
- తండ్రి ఏటీఎం కార్డు ద్వారా రూ.2 లక్షలు ఖర్చు
- ఆన్ లైన్ లో కిడ్నీ అమ్మేందుకు యత్నం
- రూ.3 కోట్లు ఇస్తామంటూ సైబర్ మోసగాళ్ల ఎర
- రూ.16 లక్షలు పోగొట్టుకున్న యామిని
ఓ అమ్మాయి తండ్రి ఖాతా నుంచి డబ్బు వాడుకుని, ఆ డబ్బు తిరిగి ఇచ్చేందుకు కిడ్నీ అమ్మాలని నిశ్చయించుకుంది. కానీ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకుంది.
గుంటూరు జిల్లా ఫిరంగిపురం గ్రామానికి చెందిన యామిని హైదరాబాదులో నర్సింగ్ కోర్సు అభ్యసిస్తోంది. తండ్రి ఏటీఎం కార్డు ద్వారా వ్యక్తిగత అవసరాల కోసం ఆమె రూ.2 లక్షల వరకు వాడుకుంది. అయితే, ఆ డబ్బు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకుంది.
కిడ్నీ అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయని భావించి ఆన్ లైన్ లో కనిపించిన ఓ ఫోన్ నెంబరుకు సందేశం పంపింది. దాంతో వారు ఆన్ లైన్ లో యామినిని సంప్రదించారు. యామిని అవసరాన్ని గుర్తించిన సైబర్ మోసగాళ్లు రూ.3 కోట్లు ఇస్తామని ఎర వేశారు.
అయితే, ఈ మొత్తాన్ని బదిలీ చేయాలంటే పన్నులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పి, ఆమె నుంచి పలు దఫాలుగా రూ.16 లక్షల వరకు రాబట్టారు. మోసగాళ్లు సృష్టించిన ఆన్ లైన్ అకౌంట్ లో రూ.3 కోట్ల మొత్తం కనిపిస్తుండడంతో ఇంకేమీ ఆలోచించకుండా వారు అడిగినంత మొత్తాన్ని చెల్లించింది.
డాక్టర్ ప్రవీణ్ రాజ్ పేరిట పరిచయం చేసుకున్న మోసగాడు, ఆమెను ఢిల్లీ రావాలని సూచించాడు. ఆమె ఖాతాలో రూ.10 వేల నగదు కూడా జమ చేశారు. అయితే, ఢిల్లీ వెళ్లిన యామినికి అక్కడెవరూ కనిపించకపోవడంతో తాను మోసపోయానని గుర్తించింది. ఈ విషయం తండ్రికి తెలియజేసింది.
అనంతరం తండ్రితో కలిసి ఆమె గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఈ సైబర్ మోసంపై స్పందిస్తూ, ఆన్ లైన్ లో కనిపించే అన్ వెరిఫైడ్ లింకులపై క్లిక్ చేయరాదని స్పష్టం చేశారు.