Dinesh Karthik: శిఖర్ ధావన్ అద్భుతమైన వన్డే కెరీర్ ముగిసినట్టే: దినేశ్ కార్తీక్
- బంగ్లాదేశ్ తో జరిగిన సిరీస్ లో విఫలమైన ధావన్
- శ్రీలంక సిరీస్ కు ధావన్ కు అవకాశం కష్టమేనన్న దినేశ్
- ప్రస్తుతం వన్డేలకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్న ధావన్
టీమిండియా స్టార్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ అద్భుతమైన వన్డే కెరీర్ ముగిసినట్టేనని వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ లో పేలవమైన ప్రదర్శనను కనపరిచిన ధావన్ కేవలం 7, 8, 3 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే సమయంలో యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్ చెలరేగిపోయారు. చివరి వన్డేలో ఇషాన్ ఏకంగా డబుల్ సెంచరీ బాది తన సత్తా ఏంటో చాటాడు.
ఈ నేపథ్యంలో దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ, శ్రీలంక సిరీస్ కు ధావన్ ఉంటాడో? లేదో? చూడాలని అన్నాడు. అద్భుతమైన ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్ లను సెలెక్టర్లు ఎలా దూరం పెట్టగలరని ప్రశ్నించాడు. రోహిత్ శర్మ ఈ సిరీస్ కు అందుబాటులో ఉంటే.. మరొకరు జట్టు నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఉంటుందని... ఆ పరిస్థితి ధావన్ కే ఉండొచ్చని చెప్పాడు. ధావన్ అద్భుతమైన కెరీర్ కు ఇదొక బాధాకర ముగింపు అవుతుందని అన్నాడు. వచ్చే ఏడాది ఇండియాలో జరిగే వన్డే ప్రపంచ కప్ లో చోటు దక్కించుకోవడం ధావన్ కు కష్టమేనని చెప్పాడు. ప్రస్తుతం ధావన్ వన్డేలకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. టెస్టులు, టీ20లకు అతన్ని పక్కన పెట్టేశారు.