Cyclone Mandous: రేపు అల్పపీడనం.. ఏపీలో నేడు కూడా వర్షాలు!
- తమిళనాడు, కర్ణాటక, కేరళ మీదుగా ఉపరితల ఆవర్తనం
- రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం
- నెల్లూరు జిల్లా ఉలవపాడులో అత్యధికంగా 92.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను వణికించిన మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీనపడి నిన్న ఉపరితల ఆవర్తనంగా మారింది. దీని ప్రభావంతో నేడు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్ణాటక, ఉత్తర కేరళ మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇదే ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఏపీలో నిన్న కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడులో అత్యధికంగా 92.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుపతి, విశాఖపట్టణం, బాపట్ల సహా పలు జిల్లాల్లో నిన్న వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు భయపెట్టాయి. తుపాను కారణంగా పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లోని పంటలు ధ్వంసమయ్యాయి.