Andhra Pradesh: తుపాను బాధితులను తక్షణమే ఆదుకోవాలి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అచ్చెన్నాయుడు

OVT SHOULD SUPPORT CYCLONE VICTIMS

  • మాండౌస్ ప్రభావంతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్
  • క్షేత్ర స్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలన్న టీడీపీ నేత
  • పాడైపోయిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అల్టిమేటం
  • లేదంటే రైతుల తరఫున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక

మాండౌస్ తుపాను కారణంగా రాష్ట్రంలోని వేలాది ఎకరాల్లో పంట నీట మునిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం, నెల్లూరు, గుంటూరు, కృష్ణాతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. వర్షాలకు పంటలు నీట మునగడంతో కన్నీరుమున్నీరు అవుతున్న రైతులకు ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా శాపంగా మారిందన్నారు. కళ్లాల్లోకి చేరిన పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడంతో అది కూడా తడిసి పాడైపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

అధికారులను వెంటనే క్షేత్ర స్థాయికి పంపించి పంట నష్టాన్ని అంచనా వేయాలని అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమాన్నికేవలం పత్రికా ప్రకటనలు, ప్రసంగాలకే పరిమితం చేశారని ముఖ్యమంత్రిని విమర్శించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బాధిత రైతులను వెంటనే ఆదుకోవాలని చెప్పారు. వర్షానికి తడిసిన పంటలను కూడా మద్ధతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. వరదలకు పంట కొట్టుకుపోయిన రైతులకు నష్ట పరిహారం అందించాలని అచ్చెన్నాయుడు కోరారు. 

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కడప జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 64 మంది చనిపోయారని, వేలాది ఇళ్లు, వందలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. ఆ బాధితులకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నయాపైస పరిహారం అందలేదని విమర్శించారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డ కుటుంబాలకు ప్రభుత్వం ఆశ్రయం కల్పించలేదని ఆరోపించారు. రైతులకు పంట నష్టాన్ని భర్తీ చేయలేదని మండిపడ్డారు. 

రైతుల సంక్షేమాన్ని జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని, దీనిని తెలుగుదేశం పార్టీ ఖండిస్తోందని అచ్చెన్నాయుడు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. గత నాలుగేళ్లుగా రైతులు నష్టపోతూనే ఉన్నారని, ఇప్పటికైనా స్పదించి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. లేదంటే రైతుల తరఫున ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Andhra Pradesh
manous effect
farmers
farm losses
tdp
achennaidu
  • Loading...

More Telugu News