Tandav Web Series: ‘తాండవ్’ వెబ్ సిరీస్ వివాదం.. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఇండియా హెడ్‌ అపర్ణకు బెయిల్!

Amazon Prime Video India Head Aparna Purohit Gets Protection From Arrest

  • తాండవ్ వెబ్ సిరీస్‌లో యూపీ పోలీసులు, హిందూ దేవతలను అనుచితంగా చూపించాారని అభియోగాలు
  • గ్రేటర్ నోయిడాలో అపర్ణపై కేసు నమోదు
  • అలహాబాద్ కోర్టు తీర్పును సవాలు చేసిన అపర్ణ
  • విచారణకు సహకరిస్తుండడంతో ముందస్తు బెయిలు మంజూరు

‘తాండవ్’ వెబ్ సిరీస్ కేసులో అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఇండియా హెడ్ అపర్ణ పురోహిత్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం అపర్ణకు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. విచారణకు ఆమె సహకరిస్తుండడాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఆమెకు బెయిలు మంజూరు చేసింది. అపర్ణ తరపున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లుత్రాలు తమ వాదనలు వినిపిస్తూ తమ క్లయింట్ అపర్ణ విచారణకు సహకరిస్తున్నట్టు కోర్టుకు తెలిపారు. కాగా, అరెస్టు నుంచి అపర్ణకు గతేడాది మార్చి 5న ఉన్నత న్యాయస్థానం మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది . 

తాండవ్ వెబ్ సిరీస్‌లో ఉత్తరప్రదేశ్ పోలీసులు, హిందూ దేవతలను అనుచితంగా చూపించారని, ప్రధానమంత్రి పాత్రను ప్రతికూలంగా చిత్రీకరించినట్టు అపర్ణపై అభియోగాలు నమోదయ్యాయి. కాగా, గతేడాది జనవరి 27న వెబ్ సిరీస్ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్‌, అపర్ణ పురోహిత్, నిర్మాత హిమాన్షు మెహ్రా,  షో రచయిత గౌరవ్ సోలంకి, నటుడు మొహమ్మద్ జీషన్ అయూబ్‌లకు మధ్యంతర రక్షణ కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వెబ్ సిరీస్‌కు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్‌లలో సంబంధిత కోర్టుల నుంచి బెయిలు పొందొచ్చని పేర్కొంది.

దీంతో తనకు ముందస్తు బెయిలు ఇచ్చేందుకు నిరాకరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అపర్ణ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఆమె పిటిషన్‌ను తాజాగా విచారించిన కోర్టు ఆమెకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ముందస్తు బెయిలు మంజూరు చేసింది. కాగా, గతేడాది జనవరి 19న గ్రేటర్ నోయిడాలోని రబూపుర పోలీస్ స్టేషన్‌లో బల్బీర్ ఆజాద్ ఫిర్యాదు మేరకు అపర్ణపై కేసు నమోదైంది.

More Telugu News