travel: డీఎల్, ఆర్సీ, పొల్యూషన్ సర్టిఫికెట్ వెంట లేకపోయినా ప్రయాణించొచ్చు.. ఇదిగో ఇలా..!

- తెలంగాణ పరిధిలో ఆర్టీఏ ఎం వ్యాలెట్ పేరుతో ప్రత్యేక యాప్
- ఇందులో డిజిటల్ డీఎల్, ఆర్సీలను యాడ్ చేసుకోవచ్చు
- డిజీలాకర్ లో అన్ని డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసి పెట్టుకోవడం మరో ఐడియా
అర్జెంట్ పని మీద బైక్ లేదా స్కూటర్ పై వెళుతున్నారు. దారి మధ్యలో ట్రాఫిక్ పోలీసులు అడ్డంగా చేయి చూపించి వాహనాన్ని అడ్డుకున్నారు. లైసెన్స్ ఉందా? ఆర్సీ ఉందా? పొల్యూషన్ సర్టిఫికెట్ ఉందా? ఇన్సూరెన్స్ ఉందా? అని అడగడం సహజం. తీరా చూస్తే మీ పాకెట్ లో కానీ, వాహనంలో కానీ సదరు డాక్యుమెంట్లు లేవనుకోండి ఏంటి పరిస్థితి? బండి పక్కన పెట్టు.. చలానా కట్టు? అన్న హుంకరింపులు పోలీసుల నుంచి వినే ఉంటారు.
ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైతే భయపడాల్సిన పనే లేదండి. నిజానికి ఆ డాక్యుమెంట్లు వెంట లేనందున ట్రాఫిక్ పోలీసులు అడ్డుకోకూడదు. వారి విధి ట్రాఫిక్ నిబంధనల ప్రకారం వాహనదారులు నడుచుకునేలా చూడడమే. హెల్మెట్ ధరించకపోవడం, పరిమితికి మించి వేగంగా నడపడం, రాంగ్ రూట్ లో వెళ్లడం, ట్రాఫిక్ సిగ్నల్స్ ను బ్రేక్ చేయడం ఇలాంటి.. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు వాహనదారులను అడ్డుకోవచ్చు. అయినా, వారు డాక్యుమెంట్ల పేరుతో వాహనదారులను ఇబ్బంది పెడుతుండడం చూస్తూనే ఉంటాం. వారితో మనం వాదించలేము. అదే సమయంలో మీరు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించనంత వరకు వారి దగ్గర తగ్గాల్సిన పనేలేదు.
డాక్యుమెంట్లు అన్నీ మీ దగ్గర ఉంటే భయం ఎందుకు? అవి వెంట లేకపోయినా ఫర్వాలేదు. అప్పటికప్పుడు వారికి చూపించొచ్చు. అదెలా అంటే తెలంగాణ రాష్ట్రం పరిధిలో ఆర్టీఏ 'ఎం వాలెట్' అనే యాప్ ఒకటి ఉంది. దీన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. మొదటి సారి అయితే రిజిస్టర్ చేసుకోవాలి. అప్పటికే రిజిస్టర్ చేసుకున్న వారు లాగిన్ అవ్వాలి. ఫోన్ కు వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

