C Kalyan: సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు థియేటర్లు ఇవ్వకపోవడం బాధాకరం: నిర్మాత సి.కల్యాణ్

C Kalyan opines on theaters issue

  • థియేటర్ల అంశంపై సి.కల్యాణ్ స్పందన
  • చిరంజీవి, బాలకృష్ణ ఇండస్ట్రీకి మేలు చేసే వ్యక్తులని వెల్లడి
  • థియేటర్లు ఇవ్వకపోవడం వారిని అవమానించినట్టేనని వ్యాఖ్యలు

తెలుగు చిత్ర పరిశ్రమలో థియేటర్లకు సంబంధించిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశంపై  తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కల్యాణ్ స్పందించారు. 

ఈ సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాలు వస్తున్నాయని, అదే సమయంలో దిల్ రాజు తమిళంలో నిర్మించిన వారిసు (వారసుడు) చిత్రం కూడా రిలీజ్ కానుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో, చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలకు థియేటర్లు ఇవ్వకపోవడం బాధాకరమని సి.కల్యాణ్ పేర్కొన్నారు. ఇండస్ట్రీకి ఎంతో ఉపయోగపడుతున్న ఇద్దరు పెద్ద హీరోలను అవమానించడమేనని తెలిపారు. 

పండుగ సీజన్ లో తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలన్న నిబంధనకు కట్టుబడి ఉన్నట్టు దిల్ రాజు ప్రకటన చేయాలని కల్యాణ్ కోరారు. వారసుడు చిత్రానికి అధిక సంఖ్యలో థియేటర్లు ఇస్తున్నారంటూ ప్రచారం జరగడంతో టాలీవుడ్ నిర్మాతలు ఆందోళనకు గురవుతున్నారని  వెల్లడించారు. 

తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లో మొదట వాళ్ల చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు తెలుగులో అలా ఎందుకు చేయకూడదు? అని ప్రశ్నించారు. టాలీవుడ్ లోనూ తెలుగు చిత్రాలోకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కల్యాణ్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని నిర్మాతల మండలి ఎగ్జిబిటర్లకు చెప్పిందని వెల్లడించారు. తెలుగు వాళ్లే తెలుగు సినిమాని చంపుకుంటే ఎలా అని ఆవేదన వెలిబుచ్చారు. 

కాగా, థియేటర్ల కేటాయింపు అంశంలో మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఒకవేళ ఫిర్యాదు చేస్తే ఫిలిం చాంబర్ తప్పకుండా పరిశీలిస్తుందని అన్నారు.

C Kalyan
Theaters
Chiranjeevi
Balakrishna
Sankranthi
Dil Raju
Varasudu
Tollywood
  • Loading...

More Telugu News