Chandrababu: తన దోపిడీ ఎవరికీ తెలియదని జగన్ అనుకున్నాడు... కానీ ప్రజలకు తెలిసిపోయింది: చంద్రబాబు

Chandrababu take a swipe at CM Jagan

  • బాపట్లలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి
  • సీఎం జగన్ పాలనపై బాబు విమర్శనాస్త్రాలు
  • ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ ఇంటికేనని వెల్లడి

టీడీపీ అధినేత చంద్రబాబు బాపట్లలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో జగన్ పాలనలో అన్నీ పెరిగాయని, నిత్యావసరాల ధరలు సహా కరెంట్ బిల్లులు, ఇంటిపన్నులు, ఆర్టీసీ చార్జీలు, పెట్రో ధరలు, మద్యం ధరలు పెరిగాయని వివరించారు. నాణ్యత లేని మద్యంతో ఆడబిడ్డల తాళి తెంచుతున్నారని మండిపడ్డారు. ఇవన్నీ చూసి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని  పెట్టామని చంద్రబాబు వెల్లడించారు. 

"మీకు రూ.10 రూపాయాలు ఇచ్చి రూ.100 రూపాయలు దోచేస్తున్నాడు ఈ దొంగ ముఖ్యమంత్రి. తన దోపిడీ ఎవరికీ తెలియదని  జగన్ అనుకున్నాడు... కానీ ప్రజలకు తెలిసిపోయింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ ఇంటికి పోవడం ఖాయం. విభజనలో అనేక ఇబ్బందులు ఉన్నా ఏ కష్టం, ఇబ్బందులు పెట్టకుండా పాలన చేశాను. నాడు రోడ్లు బాగున్నాయా లేవా... ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నాయి? రోడ్ల దెబ్బకు నా నడుం కూడా పోయింది... కానీ రాష్ట్రాన్ని కాపాడాలనే సంకల్పంతో పోరాడుతున్నా. 

జగన్ రెడ్డి ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. నాడు అమరావతి బిల్లు పెట్టినప్పుడు జగన్ రెడ్డి సభలో ఒప్పుకున్నాడు. ఇక్కడ ఉండే కోన రఘుపతి కూడా ఒప్పుకున్నాడు.  జగన్ ను చూస్తే భయం వేస్తుందా...? స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. 

నా ప్రాణ సమానంగా పోలవరం ప్రాజెక్టును చూశాను. జగన్ రాగానే రివర్స్ టెండర్ అని ప్రాజెక్టును గోదావరిలో ముంచేశాడు. పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు అని చెప్పాను. జగన్ ఆ రెండు కళ్లను పొడిచేశాడు. 

స్కూళ్లకు రంగులువేసే పార్టీ కావాలా... ప్రమాణాలు పెంచే పార్టీ కావాలా? అనంతపురంలో ఓ టీచర్ గుండు చేయించుకుంటే ఫేషియల్ రికగ్నేషన్ లో అటెండెన్స్ పడలేదు.   టెక్నాలజీలో సమస్య ఉంటే టెక్నాలజీని మార్చాలి... కానీ సైకో సీఎం ఆ టీచర్ ను సస్పెండ్ చేశాడు. 

రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకుని లేస్తే కేసు...కూర్చుంటే కేసు పెడుతున్నారు. ఆఖరికి కోన రఘపతిని ప్రశ్నిస్తే కూడా కేసు... కొందరు కళంకిత అధికారుల తీరే దీనికి కారణం. బాపట్లలో ఎమ్మెల్యే అవినీతి, దందా పెరిగిపోయాయి.  ఇక్కడ లేఅవుట్ వెయ్యాలంటే రూ.10 లక్షల కప్పం కట్టాల్సిందే. బాపట్ల పట్టణ నడిబొడ్డున ఉన్న పేరం గరుడాచలం నాయుడు తూర్పుసత్రంపై వైసీపీ నేతలు కన్నేసారు.

అంగన్ వాడీ సూపర్ వైజర్ పోస్టులకు రూ.5 లక్షలు, ఆయా పోస్టులకు రూ. 2 లక్షలు వసూలు చేశాడు. పట్టణంలో అంబేద్కర్ విగ్రహ సెంటర్ లో రోడ్డుపక్కనే ఉన్న స్థలం తక్కువ ధరకే అమ్మాలని యజమానిపై ఒత్తిడి తెచ్చాడు. ఒప్పుకోలేదని మునిసిపాలిటీ వారికి చెప్పి స్థలం ముందు మరుగుదొడ్లు పెట్టించాడు. బాధితులు కోర్టుకు వెళ్లారు.

బాపట్లలో పెట్రోల్ బంకు కథ ఒకటి ఉంది. తన పెట్రోల్ బంక్ కోసం ఇతర బంకులు అన్నీ మూయించిన వ్యక్తి ఈ ఎమ్మెల్యే. పాత బస్టాండ్ లో ఉన్న పెట్రోల్ బంకును విస్తరణ పేరుతో తొలగించారు. ఇంత అవినీతి చేసి చేసి ఏం చేస్తారు... తిని తిని తిన్నది అరగకుండా పోతుంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా... జగన్ అవినీతి చేస్తుంటే కోన సైలెంట్ గా ఉంటాడా...? 

1999 తరువాత బాపట్లో టీడీపీ గెలవలేదు. ఇప్పుడు ఇంచార్జ్ గా వర్మను పెట్టాను.    ఆయనను గెలిపించాలని ప్రజలను కోరుతున్నాను. వర్మను గెలిపించే బాధ్యత మీది... అభివృద్ది చేసే బాధ్యత నాది" అని చంద్రబాబు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News