Cyclone: దూసుకొస్తున్న మాండూస్ తుపాను.. నేడు, రేపు భారీ వర్షాలు
- ఇప్పటికే తీవ్ర తుపానుగా మారిన వైనం
- ఈ రాత్రి తీరం దాటుతుందని తెలిపిన వాతావరణ శాఖ
- నేడు, రేపు ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను తీర ప్రాంతాలను వణికిస్తోంది. ఇది ఇప్పటికే తీవ్ర తుపానుగా మారింది. ప్రస్తుతం తమిళనాడులోని కారైక్కాల్ కు తూర్పు ఆగ్నేయంగా 270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోందని చెప్పింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఏపీ తీరం మీదుగా పుదుచ్చేరి - శ్రీహరికోట మధ్య శుక్రవారం అర్ధరాత్రి తీరం దాటుంతుందని అంచనా వేసింది.
ఈ క్రమంలో 65-75 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దాంతో, జాతీయ విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం చేసింది. మరోవైపు మాండూస్ తుపాను దృష్ట్యా పుదుచ్చేరి, కారైక్కాల్‌లో శుక్రవారం పాఠశాలలు, కళాశాలలను మూసివేయనున్నట్లు తమిళనాడు విద్యాశాఖ మంత్రి ఎ. నమశ్శివాయం తెలిపారు.
కాగా, తుపాను నేపథ్యంలో దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తారంగా, ఉత్తర కోస్తాలో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తారంగా, ఉత్తర కోస్తాలో ఎక్కువచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.