Gujarat: గుజరాత్ లో రికార్డు స్థాయి విజయం దిశగా బీజేపీ.. పార్టీ కార్యాలయం వద్ద మొదలైన సంబరాలు

Celbration at Gujarat BJP office

  • 182 స్థానాలకు గాను 152 స్థానాల్లో బీజేపీ ముందంజ
  • 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్
  • స్వీట్లు పంచుకుంటున్న బీజేపీ శ్రేణులు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం దిశగా బీజేపీ దూసుకుపోతోంది. రాష్ట్రంలో వరుసగా ఏడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోతోంది. గత ఎన్నికల్లో సాధించిన స్థానాల కంటే ఈసారి మరిన్ని ఎక్కువ స్థానాల్లో జయకేతనం ఎగురవేయబోతోంది. అఖండ విజయం సాధించబోతున్న నేపథ్యంలో, బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. గాంధీనగర్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ శ్రేణులు అప్పుడే సంబరాలను మొదలు పెట్టాయి. పార్టీ కార్యాలయంలో డెకరేషన్ పనులు చేపట్టారు. స్వీట్లు పంచుకుంటున్నారు.

గత 27 ఏళ్లుగా గుజరాత్ లో బీజేపీ అధికారంలో ఉండటం గమనార్హం. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ లో బీజేపీ ప్రస్తుతం 152 స్థానాల్లో లీడ్ లో ఉంది. బీజేపీకి దరిదాపుల్లో ఇతర పార్టీ ఏదీ లేదు. కాంగ్రెస్ 20 స్థానాల్లో, ఆప్ 6 చోట్ల, ఇతరులు 4 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీ రికార్డు స్థాయిలో గెలవబోతోంది.

బీజేపీ ఘన విజయం సాధించబోతున్న తరుణంలో ఆ పార్టీకి చెందిన ఒక కార్యకర్త మాట్లాడుతూ... గుజరాత్ లో కాంగ్రెస్ ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. ఆప్ కు రాష్ట్ర ప్రజల నుంచి ఏమాత్రం స్పందన రాలేదని చెప్పారు. మరొక కార్యకర్త మాట్లాడుతూ.. బీజేపీ భారీ విజయాన్ని సాధించబోతోందని... 150కి పైగా సీట్లను కచ్చితంగా కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News