Gujarat: గుజరాత్‌లో బీజేపీ.. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం.. కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
- గుజరాత్‌లో 124 స్థానాల్లో బీజేపీ, 43 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం
- హిమాచల్ ప్రదేశ్‌లో 30 స్థానాల్లో కాంగ్రెస్, 26 స్థానాల్లో బీజేపీ ముందంజ
- తుది దశకు చేరుకున్న పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలుపెట్టగా దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం గుజరాత్‌లో బీజేపీ మరోమారు అధికారం దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 124 స్థానాల్లో బీజేపీ, 43 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నడుస్తోంది. అయితే, బీజేపీ కంటే కాంగ్రెస్ కాస్తంత ముందంజలో ఉంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 26 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు ఐదు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ‘ఆప్’ ఇంకా ఖాతా తెరవలేదు. తాజా సరళి చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.