Bangladesh: క్యాచ్ వదిలేసిన రాహుల్.. కనీసం ప్రయత్నించని సుందర్.. బంగ్లాదేశ్ తో మ్యాచ్ చేజారిందిలా.. వీడియో ఇదిగో!
- సహచరులపై కెప్టెన్ రోహిత్ అసహనం
- ఇంకా బాగా ఆడాల్సిన మ్యాచ్ అంటూ వ్యాఖ్య
- బ్యాటింగ్ లో తడబడ్డా బౌలర్లు బాగా రాణించారని కితాబు
బంగ్లాదేశ్ తో జరిగిన తొలి వన్డేలో తాము ఇంకా బాగా ఆడాల్సిందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. సులభంగా గెలుస్తామనుకున్న మ్యాచ్ పలు క్యాచ్ లు జారవిడవడంతో చేజారిందని వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్ లో తడబడ్డా బౌలర్లు బాగా రాణించారని రోహిత్ పేర్కొన్నాడు. 184 పరుగుల లక్ష్యం పెద్ద కష్టమైందేమీ కాదని, బౌలర్లు రాణించడం వల్లే బంగ్లాను కట్టడి చేయగలిగామని తెలిపాడు. అయితే, ఫీల్డింగ్ లో తాము మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందన్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ ఇచ్చిన క్యాచ్ లను నేలపాలు చేయడమే తొలి వన్డేలో ఓటమికి కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా కేఎల్ రాహుల్ ఓ క్యాచ్ వదిలేయడం, పక్కనే ఉన్న వాషింగ్టన్ సుందర్ దానిని అందుకునేందుకు కనీసం ప్రయత్నించకపోవడంపై కెప్టెన్ రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మ్యాచ్ మన చేతుల్లోంచి జారిపోయింది ఇక్కడేనంటూ నెటిజన్లు ఈ వీడియోకు కామెంట్లు పెడుతున్నారు.