Gujarat: అదృశ్యమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేను అడవిలో గుర్తించిన పోలీసులు.. బీజేపీ గూండాలు తరమడం వల్లే పారిపోయానన్న ఎమ్మెల్యే
- తనపై బీజేపీ అభ్యర్థి, ఆ పార్టీ నేతలు దాడిచేశారన్న గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే
- కత్తులు, ఆయుధాలతో దాడికి దిగడంతో తప్పించుకుని పారిపోయామన్న నేత
- గుజరాత్ రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభానికి ముందు ప్రత్యక్షమైన నేత
బీజేపీ దాడితో అదృశ్యమైనట్టుగా చెబుతున్న గుజరాత్‌లోని దంతా నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంతి ఖరాడిని పోలీసులు ఓ అడవిలో గుర్తించి తీసుకొచ్చారు. గుజరాత్ రెండో విడత పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు బయటకొచ్చిన ఆయన మాట్లాడుతూ.. జరిగింది దురదృష్ణకర ఘటన అని పేర్కొన్నారు. తన ప్రాంతంలో ఎన్నికలు ఉండడంతో అక్కడికి బయలుదేరానని, అయితే, అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా ఉండడంతో అక్కడి నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.
‘‘నా ఓటర్లను కలిసేందుకు వెళ్తుండగా ఎల్‌కే బరాద్, ఆయన సోదరుడు వదన్ జీ తదితరులతో కలిసి బీజేపీ అభ్యర్థి లడ్డు పర్ఘి తదితరులు నాపై దాడిచేశారు. ఆయుధాలు ధరించిన వారు నాపై కత్తులతో దాడికి పాల్పడ్డారు’’ అని ఎమ్మెల్యే ఆరోపించారు. తాము బమోదర ఫోర్ వే గుండా వెళ్తుండగా బీజేపీ అభ్యర్థి తాము వెళ్లకుండా రహదారిని బ్లాక్ చేశాడని పేర్కొన్నారు. తాము కార్లలో తిరిగి వెళ్తుంటే తమ కార్లను వెంబడించారని, బీజేపీ దంతా నియోజకవర్గ అభ్యర్థి లడ్డు పర్ఘి, మరో ఇద్దరు కత్తులు, ఆయుధాలతో వచ్చారని అన్నారు. దీంతో తాము తప్పించుకోవాలని చూశామని, 10-15 కిలోమీటర్లు పరుగెత్తి ఓ అడవిలో దాక్కున్నామని తెలిపారు.
కాగా, కరాడీపై బీజేపీ దాడి చేసిందని, దీంతో ఆయన అదృశ్యమయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంతకుముందు ఆరోపించారు. ఇంత జరిగినా ఎన్నికల సంఘం మౌనంగా ఉండడాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనను ఖండిస్తూ ఆయన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, బనసకాంత జిల్లా ఇన్‌చార్జ్ జిగ్నేష్ మేవాని ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.
ఖరాడీ మాట్లాడుతూ.. తనపై దాడి జరిగే అవకాశం ఉందని నాలుగు రోజుల క్రితమే ఎన్నికల అధికారికి లేఖ రాశానని, అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఈ దాడి జరిగేది కాదని అన్నారు. కాగా, ఎమ్మెల్యేను ఓ అడవిలో గుర్తించి తీసుకొచ్చిన దంతా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. దంతా సీటు ఎస్టీ రిజర్వుడు. కాంగ్రెస్ నుంచి ఖరాడి బరిలో ఉండగా, బీజేపీ నుంచి లడ్డు పర్ఘి పోటీ చేస్తున్నారు. తాజాగా, జరుగుతున్న రెండో విడత ఎన్నికల్లో ఈ సీటు కూడా ఉంది.