Vijay Devarakonda: ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ
- లైగర్ సినిమా పెట్టుబడుల లెక్కలపై ప్రశ్నిస్తున్న అధికారులు
- పూరీ జగన్నాథ్, ఛార్మీలను ఇప్పటికే విచారించిన ఈడీ
- ఈ సినిమా నిర్మాణంలో హవాలా కోణంపై ఆరా తీస్తున్న వైనం
హీరో విజయ్ దేవరకొండ బుధవారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. లైగర్ సినిమా నిర్మాణ వ్యవహారాలకు సంబంధించి అధికారులు విజయ్ ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మీ కూడా విచారణకు హాజరయ్యారు.
లైగర్ సినిమా నిర్మాణానికి నిధుల వ్యవహారంలో పెద్ద దుమారం రేగింది. ముందు నగదును దుబాయ్ కి పంపి, అక్కడి నుంచి పెట్టుబడుల రూపంలో తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సినిమా నిర్మాణంతో సంబంధం ఉన్న వాళ్లందరినీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నేత ప్రమేయం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ నేతకు, ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధం ఉందని భావిస్తున్నారు.
'జనగణమన' పేరుతో కొత్త సినిమాను ప్రకటించిన విజయ్ దేవరకొండ.. లైగర్ నిర్మాణ సమయంలోనే కొత్త సినిమా కోసం కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఇందుకు సుమారు రూ.20 కోట్ల దాకా అయినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని సమకూర్చింది ఎవరనేది బయటపడాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, లైగర్ హిందీ వెర్షన్ కు కరణ్ జొహార్ కూడా నిర్మాతగా వ్యవహరించారు.