Gujarat: గుజరాత్ ఎన్నికలు: ముగిసిన తొలిదశ ఎన్నికల ప్రచారం.. రేపే పోలింగ్

Campaigning for Gujarat Assembly phase 1 elections ends

  • 19 జిల్లాల పరిధిలోని 89 స్థానాలకు రేపు పోలింగ్
  • బరిలో 788 మంది అభ్యర్థులు
  • అన్ని స్థానాల్లోనూ పోటీపడుతున్న బీజేపీ, కాంగ్రెస్
  • పోటీలో ఉన్న వారిలో 69 మంది మహిళలు

గుజరాత్ శాసనసభ ఎన్నికల తొలిదశ ప్రచారం నిన్న సాయంత్రం 5 గంటలకు ముగిసింది. తొలి విడతలో దక్షిణ గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాలకు చెందిన 19 జిల్లాల పరిధిలోని 89 స్థానాలకు రేపు (గురువారం) పోలింగ్ జరుగుతుంది. 89 స్థానాలకు మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోటీలో ఉన్న వారిలో 719 మంది పురుషులు కాగా, 69 మంది మహిళలు ఉన్నారు. 

బీజేపీ, కాంగ్రెస్ మొత్తం స్థానాల్లో పోటీపడుతుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ 88 స్థానాల్లో బరిలోకి దిగింది. బీఎస్పీ, ఎంఐఎం, వామపక్షాలు కూడా పోటీలో ఉన్నప్పటికీ బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ విడతలో పోటీ పడుతున్న ప్రముఖుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గధ్వీ, ఆ పార్టీ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం కావడంతో ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు బీజేపీ నాయకులు విస్తృత ప్రచారం చేశారు. భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ రెండు రోజులు మాత్రమే పర్యటనలో పాల్గొన్నారు.

Gujarat
Gujarat Assembly Elections
BJP
Congress
AAP
  • Loading...

More Telugu News