Blood Sugar: 6 గంటల కంటే నిద్ర తగ్గితే.. డయాబెటిస్ ముప్పు

The Relationship Between Blood Sugar and Sleep
  • నిద్రకు.. బ్లడ్ షుగర్ కు మధ్య సంబంధం
  • నిద్రలేమితో రక్తంలో అసహజంగా గ్లూకోజ్ స్థాయి
  • దీర్ఘకాలం పాటు ఇలానే కొనసాగితే టైప్-2 డయాబెటిస్
చాలా మంది నిద్రకు అంత ప్రాధాన్యం ఇవ్వరు. కొందరు నిద్రే ప్రధానంగా భావిస్తుంటే, మరికొందరు అసలు నిద్రకు అంత ప్రాముఖ్యత ఇవ్వరు. కానీ, నిద్ర వల్ల నూరు శాతం ప్రయోజనాలున్న విషయాన్ని గుర్తిస్తే, చాలా వరకు వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. తాజాగా జరిగిన ఓ పరిశోధన వివరాలను పరిశీలించినట్టయితే..

ఒక వ్యక్తి నిద్రించినప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరుగుతాయి. రాత్రులు, నిద్ర సమయాల్లో ఇలా రక్తంలో గ్లూకోజ్ పరిమాణం హెచ్చు, తగ్గులకు లోను కావడం సహజమే. ఆరోగ్యవంతులైన వారు దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, నిద్ర లేమి సమస్య ఉన్నవారికి ఇది ఆందోళనకరమే అని చెప్పుకోవాలి. నిద్ర లేమితో వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయులు అసహజంగా మారతాయి. 

ముఖ్యంగా మధుమేహం ఉన్న వారికి నిద్రలేమి సమస్య ఏర్పడితే, వారి బ్లడ్ షుగర్ నియంత్రణలో లేకుండా పోతుంది. సరైన నిద్ర లేకపోయినా ఇదే సమస్య ఏర్పడుతుంది. నిద్ర లేచినప్పుడు శక్తి చాలదన్నట్టుగా (చేతకావడం లేదన్న భావన) అనిపించడం అది నిద్రలేమికి సూచన. దీంతో వెంటనే ఏదో ఒకటి తినేయాలని అనిపిస్తుంది. ఇలా దీర్ఘకాలం పాటు నిద్రలేమి అధిక బ్లడ్ షుగర్ సమస్యను కలిగిస్తుంది. దీనివల్ల ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. 

ఇన్సులిన్ నిరోధకత అంటే పాంక్రియాస్ నుంచి విడుదలైన ఇన్సులిన్ కు మన కణాలు స్పందించకపోవడం. రక్తంలోని గ్లూకోజ్ ను ఉపయోగించుకుని శక్తిగా మార్చలేకపోవడం. దీనివల్ల పాంక్రియాస్ మరింత ఇన్సులిన్ ను విడుదల చేస్తుంది. కొంత కాలానికి బ్లడ్ షుగర్ స్థాయులు మరింత పెరుగుతాయి.  ఇదే టైప్-2 డయాబెటిస్ గా రూపాంతరం చెందుతుంది. స్థూలకాయం సమస్యకు కూడా కారణమవుతుంది. 

తగినంత నిద్ర..
రోజుకు 7-8 గంటల పాటు నిద్ర అవసరం. అప్పుడే మన శరీరంలో జీవక్రియలు సరిగ్గా సాగుతాయి. తగినంత నిద్ర లేకపోవడం, సరైన వేళ్లల్లో నిద్రించకపోవడం, అధిక నిద్ర ఎన్నో సమస్యలు కారణమవుతుంది. నిద్ర సరిగ్గా లేకపోవడం గుండె జబ్బులకు కూడా కారణమవుతుంది. రక్తంలో బ్లడ్ షుగర్ ను నియంత్రణలో పెట్టుకుంటే, గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహం, స్థూలకాయం సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

పాంక్రియాస్ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయలేకపోతే, టైప్-1 డయాబెటిస్ గా చెబుతారు. పాంక్రియాస్ విడుదల చేసిన ఇన్సులిన్ ను సరిగ్గా ఉపయోగించుకోలేనప్పుడు అది టైప్-2 డయాబెటిస్ కు దారితీస్తుంది. 

రిస్క్ అధికం
మధుమేహం ఉన్న వారికి గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్ ఎక్కువని పలు అధ్యయనాలు తేల్చాయి. కనుక ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. ఇందుకోసం శరీరానికి తగినంత నిద్ర ఇవ్వాలి. దీనివల్ల చాలా సమస్యలను దూరంగా పెట్టొచ్చు. రోజులో 6 గంటలకు తక్కువ నిద్రపోయే వారికి టైప్-2 డయాబెటిస్ ముప్పు ఉంటుంది. అలాగే, రోజులో 9 గంటలకు మించి నిద్ర పోయే వారికి కూడా మధుమేహం ముప్పు ఉంటుంది. ముఖ్యంగా ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో కార్టిసాల్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. ఫలితంగా డయాబెటిస్ సమస్య ఏర్పడుతుంది. కనుక 7-8 గంటల పాటు నిద్ర, శారీరక వ్యాయామం అన్నవి మధుమేహం ముప్పును తప్పించుకునేందుకు కీలకమని గుర్తించాలి.
Blood Sugar
Sleep
type 2 diabetis
sleep deprivation

More Telugu News