Amaravati: సుప్రీంకోర్టు తీర్పుతో ఏపీ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి: అమరావతి రైతులు

The AP government should open its eyes with the Supreme Court verdict

  • విభజన చట్టంలో ఒక రాజధాని మాత్రమే ఉందని సుప్రీం చెప్పిందన్న అమరావతి రైతులు
  • ఇకనైనా రాజధాని వివాదానికి ప్రభుత్వం ముగింపు పలకాలన్న సీపీఐ రామకృష్ణ
  • హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని సుప్రీంకు ప్రభుత్వ తరపు లాయర్ తెలిపారని వ్యాఖ్య

ఏపీ రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఆ ప్రాంత రైతులు అన్నారు. ఏపీ విభజన చట్టంలో ఒక రాజధాని అని మాత్రమే ఉందని... రాజధానిపై పార్లమెంటు చేసిన చట్టాన్ని ప్రభుత్వం ఎలా మార్చగలదని సుప్రీంకోర్టు ప్రశ్నించిందని వారు చెప్పారు. రైతులకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీని ఎలా ఉల్లంఘిస్తారని అడిగిందని అన్నారు. డిసెంబర్ 17 నాటికి రాజధాని రైతుల ఉద్యమం మూడు సంవత్సరాలకు చేరుకోనుంది. ఈ క్రమంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వారు నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలంతా ఏకమై సంఘీభావం ప్రకటించాలని వారు కోరారు. 

మరోవైపు సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ... సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను గౌరవించైనా రాజధాని వివాదానికి వైసీపీ ప్రభుత్వం ముగింపు పలకాలని కోరారు. అమరావతి విషయంలో ఏవైనా అభ్యంతరాలుంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని అన్నారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని చెప్పారని... అంటే హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ చెప్పడం మోసమేనని విమర్శించారు.

More Telugu News