Jio: దేశవ్యాప్తంగా జియో సేవలకు అంతరాయం
- కాల్స్, ఎస్ఎంఎస్ లు చేసుకోలేని పరిస్థితి
- కొందరికి ఇంటర్నెట్ లోనూ సమస్యలు
- సామాజిక మాధ్యమాలపై వెల్లడి
దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో నెట్ వర్క్ లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. కొంత మంది యూజర్లు నిన్నటి నుంచే ఈ అనుభవాలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తమ ఇబ్బందులను సోషల్ మీడియా వేదికలపై ఇతరులతో పంచుకుంటున్నారు. కాల్స్, ఎస్ఎంఎస్ లు చేసుకునేందుకు నెట్ వర్క్ పనిచేయడం లేదు. అలాగే ఇంటర్నెట్ బ్రౌజింగ్ లోనూ సమస్యలు ఉన్నట్టు యూజర్లు మొత్తుకుంటున్నారు.
‘‘వోల్టే సింబల్ ఉదయం నుంచి కనిపించడం లేదు. దీంతో కాల్స్ చేసుకోలేని పరిస్థితి ఉంది. సాధారణ కాల్స్ కే సమస్యలు ఎదురవుతున్నప్పుడు 5జీ సేవలను అందించేందుకు మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు? అంటూ ఓ యూజర్ ప్రశ్నించాడు. కొందరు యూజర్లకు ఇంటర్నెట్ బ్రౌజింగ్ లోనూ సమస్యలు ఉన్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు జియో నెట్ వర్క్ లో సమస్యలు ఎదురైనట్టు తెలుస్తోంది.
మొబైల్ నెట్ వర్క్ లో సమస్యలను ట్రాక్ చేసే డౌన్ డిటెక్టర్ పోర్టల్ చెబుతున్న దాని ప్రకారం.. 37 శాతం మంది యూజర్లు తమకు సిగ్నల్ రావడం లేదంటున్నారు. 37 శాతం మంది కాల్స్, ఎస్ఎంఎస్ లు చేసుకోలేకపోతున్నట్టు, 26 శాతం మంది యూజర్లు మొబైల్ ఇంటర్నెట్ లోనూ సమస్యలు ఉన్నట్టు చెబుతున్నారు. ప్రధానంగా ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్ కతా పట్టణాల నుంచి యూజర్లు ఈ సమస్యలను ఎత్తి చూపుతున్నారు.