Paritala Sunitha: నువ్వు రూ. 10 కోట్లు డిమాండ్ చేశావు కాబట్టే జాకీ పరిశ్రమ పోయింది: పరిటాల సునీత
- తోపుదుర్తి బ్రదర్స్ పై పరిటాల సునీత మండిపాటు
- రాప్తాడు నియోజకవర్గాన్ని నాశనం చేశారని విమర్శ
- మేము తిరగబడితే మీ సంగతి చూస్తామని వార్నింగ్
తమ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ పై రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రెండు జిల్లాల ఎస్పీలకు ఫిర్యాదు చేశామని పరిటాల సునీత తెలిపారు. రామగిరి సీఐ వంటి వారు వైసీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని... ఈ సీఐ ఎప్పుడు పోతాడా అని కానిస్టేబుళ్లు కూడా అనుకుంటున్నారని చెప్పారు. నా బావమరిదిని నేను కాపాడుకోవాలి కదా? అని సీఐ అంటున్నాడంట అని ఆమె మండిపడ్డారు. ఆయన బావమరిది ప్రకాశ్ రెడ్డి అని చెప్పారు.
పోలీసు వ్యవస్థ ఇలా ఉందని... ఇక ఎవరికి చెప్పుకోవాలని అన్నారు. ఎస్పీలకు చెప్పినా ఎలాంటి కదలిక లేదని విమర్శించారు. తప్పు ఏదైనా చేస్తే కేసు పెట్టుకోవచ్చని, ఏమీ లేకుండా కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. కొట్టింది వైసీపీ వాళ్లు, దెబ్బలు తిన్నది మావాళ్లు అయితే... పోలీసులు మావాళ్ల పై కేసులు పెట్టారని మండిపడ్డారు. మా వాళ్లపై 307 కేసు పెట్టారని... వైసీపీ వాళ్లకు స్టేషన్ బెయిల్ ఇచ్చారని అన్నారు.
మేము తిరగబడితే మీ కథ చూస్తామని ఎమ్మెల్యేకి సునీత వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో వైసీపీకి చెందిన ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టలేదని అన్నారు. ఒక్కసారి నీవు ఎమ్మెల్యే అయిన వెంటనే రాప్తాడు నియోజకవర్గాన్ని మొత్తం పాడు చేశావని మండిపడ్డారు. రూ. 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశావు కాబట్టే జాకీ పరిశ్రమ ఇక్కడి నుంచి వెళ్లిపోయిందని అన్నారు. దీనిగురించి చంద్రబాబు, సీపీఐ రామకృష్ణ, సోము వీర్రాజు మాట్లాడితే.... నోటికొచ్చినట్టు ఇష్టానుసారం మాట్లాడతావా అని మండిపడ్డారు. మీరు తప్పు చేయకపోతే జాకీ కంపెనీతో స్టేట్మెంట్ ఇప్పించాలని డిమాండ్ చేశారు.
పరిటాల రవిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ లు చంపించారనే విషయాన్ని నీ నోటితోనే చెపుతున్నావని సునీత అన్నారు. ఆనాడు అనుకుని ఉంటే చంద్రబాబు ఇంట్లోకి వెళ్లి మొద్దు శ్రీను చంపేవాడని చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బదులుగా ఆమె ఈ కామెంట్ చేశారు.