Jagan: సీఎం జగన్ నివాసం ముట్టడికి గిరిజన సంఘాల పిలుపు.. భారీ భద్రత ఏర్పాటు!
- వాల్మీకి, బోయ, బెంతు కులాలను ఎస్టీల్లో చేర్చొద్దని డిమాండ్
- తమకు రిజర్వేషన్లు తగ్గిపోతాయని ఆందోళన
- సీఎం నివాసానికి వెళ్లే మార్గాల్లో మూడంచెల భద్రత
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసం ముట్టడికి గిరిజన సంఘాలు పిలుపునివ్వడంతో అక్కడ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం నివాసం చుట్టూ అదనపు బలగాలు మోహరించాయి. వాల్మీకి, బోయ, బెంతు కులాలను ఎస్టీల్లో చేర్చవద్దని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కులాలను ఎస్టీలలో చేరిస్తే తమకు రిజర్వేషన్లు తగ్గిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం ఇంటి ముట్టడికి వారు పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే మార్గాల్లో మూడంచెల భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ కట్ట, పాత టోల్ గేట్ కూడలి, తాడేపల్లి పశువైద్యశాల మార్గం, పాతూరు అడ్డరోడ్డు, క్రిస్టియన్ పేట కూడళ్లలో వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన వారిని అక్కడి నుంచి తరలిస్తున్నారు.