Chaganti Koteswararao: చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారంపై వివాదం
- ప్రతి ఏటా గురజాడ అవార్డు ప్రదానం
- ఈ ఏడాది అవార్డుకు ప్రవచనకర్త చాగంటి ఎంపిక
- అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కవులు, కళాకారులు
- గురజాడ హేతువాది అని వెల్లడి
- చాగంటి అందుకు పూర్తి విరుద్ధమని స్పష్టీకరణ
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ప్రవచనకర్తగా పేరొందిన చాగంటి కోటేశ్వరరావును గురజాడ పురస్కారానికి ఎంపిక చేయడం వివాదాస్పదమైంది. నవంబరు 30న నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా చాగంటి కోటేశ్వరరావుకు అవార్డు ప్రదానం చేయాలని నిర్వాహకులు భావించారు. అయితే, దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
అభ్యుదయ భావజాలం ఉన్న హేతువాదిగా గురజాడ అప్పారావు కొనసాగారని, కానీ చాగంటి కోటేశ్వరావు అందుకు పూర్తి విరుద్ధమైన వ్యక్తి అని, నిత్యం దేవుడి గురించి చెబుతూ ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసే వ్యక్తి అని హేతువాదులు, కవులు, కళాకారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వారు విజయనగరంలోని గురజాడ అప్పారావు ఇంటి నుంచి నిరసన ఊరేగింపు చేపట్టారు.
గురజాడ గౌరవయాత్ర పేరుతో సాహితీ, సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గురజాడ అవార్డును చాగంటికి ఇవ్వడం సరికాదని నినాదాలు చేశారు. పట్టణంలోని గురజాడ విగ్రహం వద్ద కవులు, కళాకారులు ఆందోళన జరిపారు.