paritala sunitha: పరిటాల సునీత ఆందోళనతో ఏపీలో ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్ ముందు టీడీపీ నేతల ఆందోళన
- టీడీపీ నేత జగ్గును విడుదల చేయాలని డిమాండ్
- పరిటాల కుటుంబాన్ని భూస్థాపితం చేస్తామన్న ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడు
- కౌంటర్ వ్యాఖ్యలు చేసిన టీడీపీ బత్తలపల్లి నేత జగ్గు
- శనివారం రాత్రి జగ్గును అరెస్టు చేసిన కొత్తపల్లి పోలీసులు
అక్రమంగా అరెస్టు చేసిన తెలుగుదేశం పార్టీ నేత జగ్గును విడుదల చేయాలంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగడంతో ఆంధ్రప్రదేశ్ లోని కొత్తపల్లిలో ఉద్రిక్తతకు దారితీసింది. పరిటాల సునీతకు మద్దతుగా భారీగా టీడీపీ శ్రేణులు తరలిరావడంతో కొత్తపల్లిలో టెన్షన్ నెలకొంది. జగ్గు అరెస్టు అక్రమమని, జగ్గును విడుదల చేసేదాకా ఆందోళన కొనసాగుతుందని మాజీ మంత్రి సునీత పోలీసులకు తేల్చిచెప్పారు.
ఇటీవల రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి పరిటాల కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిటాల కుటుంబాన్ని భూస్థాపితం చేస్తామని, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ లను చంపేస్తామని హెచ్చరించారు. దీనిపై బత్తలపల్లికి చెందిన టీడీపీ నేత జగ్గు కౌంటర్ వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసులు కల్పించుకుని శనివారం రాత్రి జగ్గును అరెస్టు చేసి తీసుకెళ్లారు.
జగ్గు కోసం కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చిన తమ నాయకులపై వైసీపీ నేతలు దాడికి దిగారని పరిటాల సునీత ఆరోపించారు. వైసీపీ నేతలకు సహకరించిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పరిటాల కుటుంబంపై, చంద్రబాబు, లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రశేఖర్ రెడ్డిపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత డిమాండ్ చేశారు.