Supreme Court: ఇమామ్‌లకు గౌరవ వేతనాలపై సుప్రీం నిర్ణయాన్ని తప్పుబట్టిన సీఐసీ ఉదయ్ మహుర్కర్
- ఇమామ్‌లకు గౌరవ వేతనం చెల్లించాలంటూ 1993లో సుప్రీం ఆదేశాలు
- పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఏ మతానికీ అనుకూలంగా ఉపయోగించకూడదన్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 27
- సుప్రీం తీర్పు సామాజిక అసమానతకు కారణమైందన్న మహుర్కర్
ఇమామ్‌లకు గౌరవ వేతనం చెల్లించాలంటూ 13 మే 1993లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ ఉల్లంఘనేనని కేంద్ర సమాచార కమిషనర్ (సీఐసీ) ఉదయ్ మహుర్కర్ పేర్కొన్నారు. ఇమామ్‌లకు ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ వక్ఫ్ బోర్డు చెల్లిస్తున్న వేతనాల వివరాలు తెలపాలని ఆర్టీఐ కార్యకర్త సుభాష్ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా మహుర్కర్ ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఓ తప్పుడు సంప్రదాయం నెలకొందని పేర్కొన్నారు. అంతేకాక, ఇది అనవసర రాజకీయ వివాదానికి, సామాజిక అసమానతలకు కారణమైందని వివరించారు.
పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఏ మతానికీ అనుకూలంగా వినియోగించకూడదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 27 నిబంధన చెబుతోందని గుర్తు చేసిన మహుర్కర్.. ఇమామ్‌లకు గౌరవ వేతానాన్ని చెల్లించడం అంటే దానిని ఉల్లంఘించడం తప్ప మరోటి కాదని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 25 నుంచి 28 వరకు ఉన్న ఆర్టికల్ నిబంధనలు అమలు చేయాలని, అందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని మతాల పూజారులకు ఖజానా నుంచి చెల్లిస్తున్న వేతనాల చెల్లింపులకు సంబంధించిన ఆర్డర్ కాపీని కేంద్ర న్యాయశాఖ మంత్రికి పంపాలని ఆయన ఆదేశించారు.