Sex: గుండె జబ్బులుంటే.. శృంగారం విషయంలో రిస్క్!

Is Sex Dangerous If You Have Heart Disease

  • శృంగారం సమయంలో గుండెపై అదనపు శ్రమ
  • గుండె కొట్టుకునే వేగం, రక్త ప్రసరణలో పెరుగుదల
  • గుండె సంబంధిత సమస్యలుంటే వైద్యుల సూచన అవసరం

శృంగారం మంచి వ్యాయామాల్లో ఒకటని వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే ఒక్కసారి శృంగారంతో సుమారు 200 కేలరీలు ఖర్చవుతాయి. మానసిక, శారీరక ఆరోగ్యం బలపడుతుంది. కానీ, ఇదంతా ఆరోగ్యవంతులకేనని గుర్తు పెట్టుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న పురుషులు, మరీ ముఖ్యంగా గుండె జబ్బులున్న వారు వైద్యుల సూచన మేరకే శృంగారం విషయంలో నడుచుకోవాలి. 

రిస్క్ ఉందా..?
శృంగారం సమయంలో గుండెపై అధిక పని భారం పడుతుంది. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ముఖ్యంగా పురుషుల ప్రైవేటు పార్ట్ వద్దకు అధిక రక్త ప్రసరణ అవసరమవుతుంది. ఈ మార్పులను తట్టుకోగల సామర్థ్యంతో గుండె ఉన్నప్పుడు నిస్సంకోచంగా శృంగారంలో పాల్గొనవచ్చు. ఏ ఇబ్బంది లేకుండా ఎన్ని మెట్లు అయినా ఎక్కే సామర్థ్యం ఉంటే (ఆ సమయంలో ఛాతీలో నొప్పి రాకూడదు), అలాగే, 20 నిమిషాల పాటు ఆగకుండా వేగంగా నడిచినప్పుడు ఛాతీలో ఎలాంటి నొప్పి రాకుండా ఉంటే, కళ్లు తిరగకుండా ఉన్న వారికి ఇబ్బంది ఎదురుకాకపోవచ్చు. ఈ సమయాల్లో శ్వాస వేగంగా తీసుకోవాల్సి వస్తుంది. ఆ సమయంలో ఛాతీలో నొప్పి వచ్చినా, కళ్లు తిరిగినా, ఊపిరి ఆడనట్టు అనిపిస్తే హెచ్చరికగానే తీసుకోవాలి. 

మయోక్లినిక్ చెబుతున్న దాని ప్రకారం.. గుండె జబ్బులున్నవారు, హార్ట్ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్న వారు సెక్స్ లో పాల్గొనడం రిస్క్ అని భావించడం అసాధారణమేమీ కాదు. హార్ట్ ఫెయిల్యూర్ కోసం వాడే మందులతో శృంగార సామర్థ్యం కూడా తగ్గుతుంది. అంతేకాదు, శృంగారం సమస్యలో దుష్ప్రభావాలు కూడా కనిపిస్తుంటాయి. 

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అయితే.. శృంగారం హార్ట్ ఎటాక్ కు దారితీయడం అరుదుగానే జరుగుతుందని అంటూ.. హార్ట్ కండిషన్ నిలకడగా ఉందని వైద్యులు చెప్పే వరకు శృంగారానికి దూరంగా ఉండాలని సూచిస్తోంది. గుండెకు సంబంధించి శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు సైతం శృంగారంలో పాల్గొనకుండా ఉండడం మంచిది.

ఉదాహరణ
తాజాగా బెంగళూరులో 67 ఏళ్ల వ్యక్తి శృంగారం సమయంలో హార్ట్ ఎటాక్ తో చనిపోయినట్టు గుర్తించారు. తన ఇంట్లో పనిచేసే 35 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, ఆమెతో శృంగారంలో వున్నప్పుడు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే సదరు వ్యక్తి మరణించాడు. ఏడాది క్రితమే అతడికి యాంజియోప్లాస్టీ అయినట్టు తెలిసింది. 

శృంగారంతో ఆరోగ్యం
 శృంగారం గుండె ఆరోగ్యాన్ని పెంచుతుందని పలు అధ్యయనాలు ఇప్పటి వరకు తేల్చాయి. వారంలో కనీసం రెండు సార్లు శృంగారం చేసే పురుషులు, శృంగారం విషయంలో సంతృప్తిగా ఉండే మహిళలకు హార్ట్ ఎటాక్ రిస్క్ తక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. కాకపోతే ముందు చెప్పుకున్నట్టు దీర్ఘకాలిక వ్యాధులు, గుండె జబ్బులు ఉన్న వారు, మేజర్ సర్జరీ చేయించుకున్న వారు వైద్యుల సూచన మేరకే ఈ విషయంలో నడుచుకోవాలి.

  • Loading...

More Telugu News