china: ఐఫోన్ సిటీలో లాక్ డౌన్ పెట్టిన చైనా
- ఐదు రోజుల పాటు ఆంక్షల విధింపు
- శుక్రవారం నుంచి అమలులోకి
- కరోనా కేసులు పెరగడమే కారణమని వెల్లడి
- ఫాక్స్ కాన్ కంపెనీలో నిరసన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం
ఐఫోన్ తయారీకి సంబంధించి అతిపెద్ద కంపెనీ ఉన్న సిటీలో చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఐఫోన్ సిటీగా పిలిచే జెంగ్జూ నగరంలో ఐదు రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 25 నుంచి 29 వరకు కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. కరోనా కేసులు తీవ్రంగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జెంగ్జూ పాండెమిక్ టాస్క్ ఫోర్స్ బుధవారం రాత్రి ఓ ప్రకటన వెలువరించింది. అయితే, ఐఫోన్ తయారీ కంపెనీ ఫాక్స్ కాన్ లో ఉద్యోగుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
యాజమాన్యం తీరుకు నిరసనగా కార్మికులు ఆందోళన చేయడంతో ఫాక్స్ కాన్ కంపెనీ దగ్గర ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించింది. ప్లాంట్ లోపల పలువురు ఉద్యోగులు కరోనా బారిన పడడంతో ఉద్యోగులు అందరినీ లోపలే ఉంచేసింది. వారికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసి, వైరస్ బాధితులకు వైద్య సదుపాయం కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనం కూడా భారీగా పెంచినట్లు తెలిపింది.
గతంలో కొంతమంది ఉద్యోగులు ఫెన్సింగ్ దూకి మరీ పారిపోవడంతో ఫాక్స్ కాన్ కంపెనీ కొత్తగా మరికొంతమందిని ఉద్యోగాల్లోకి తీసుకుంది. రెండు నెలలు పనిచేస్తే సుమారు రూ.3 లక్షల దాకా ఇస్తామని చెప్పడంతో కొందరు ముందుకొచ్చారు. వారిని ప్లాంట్ లోపలే ఉంచి పనిచేయించుకుంది. అయితే, తమకు హామీ ఇచ్చినట్లు జీతం ఇవ్వట్లేదని ఉద్యోగులు ఆందోళన చేశారు. కంపెనీ డార్మిటరీల నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు.
ఫాక్స్ కాన్ కంపెనీ వద్ద కఠిన ఆంక్షలు..
ఉద్యోగులను కంట్రోల్ చేయడానికి ఫాక్స్ కాన్ కంపెనీ దగ్గర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింది. బయటకు వచ్చిన ఉద్యోగులపై పోలీసులు లాఠీచార్జి చేసి మళ్లీ లోపలకి పంపించారు. పోలీసులు విచక్షణారహితంగా కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం జెంగ్జూలో ఐదు రోజుల పాటు లాక్ డౌన్ విధించినట్లు ప్రచారం జరుగుతోంది.