KOMMAREDDY PATTABHI RAM: అది భూ రక్ష కాదు.. భూ భక్ష.. జాగ్రత్తగా ఉండకుంటే భూములు హుళక్కే: టీడీపీ నేత పట్టాభి
- జగన్ కన్ను ఇప్పుడు ప్రజల భూములపై పడిందన్న పట్టాభిరామ్
- భూములను కంటికి రెప్పలా కాపాడుకోవాలని సూచన
- కబ్జాకోరులను పక్కనపెట్టుకుని నీతి వాక్యాలు వల్లిస్తున్నారని ఫైర్
- జాకీ పరిశ్రమను తరిమేసి ప్రజలకు అండర్‌వేర్లు కూడా మిగల్చకుండా చేశారని ఫైర్
అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములను ఆక్రమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కన్ను ఇప్పుడు ప్రజల భూములపై పడిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ప్రజల భూములపై కన్నేసిన జగన్ ఇప్పుడు మీ భూమి-నాభూమి అంటూ కొత్తగా భూరక్ష పేరుతో భూభక్ష పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు.
జగన్ పాలనలో ప్రజలు తమ భూములను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జగన్ ప్రారంభించినది భూ రక్ష పథకాన్ని కాదని, భూ భక్షణ పథకాన్ని అని విమర్శించారు. ప్రజల భూములను తన భూములుగా చెప్పేందుకే జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు. పరాయి వాడి భూమిని ఆక్రమిస్తే అది కబ్జా అవుతుందన్న విషయం ఇప్పుడు తెలిసిందా? అని ప్రశ్నించారు.
ధర్మాన, విజయసాయి భూబాగోతాల సంగతేంటి?
నర్సన్నపేటలో జగన్‌తో వేదిక పంచుకున్న మంత్రి ధర్మాన భూబాగోతం సంగతేంటని ప్రశ్నించారు. మాజీ సైనికుల భూమిని ధర్మాన కబ్జా చేశారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ తోపాటు సభలో జగన్ పక్కన కూర్చున్న భూకబ్జాదారుల సంగతేంటని పట్టాభిరామ్ నిలదీశారు. వారికి కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాల్సిందన్నారు. జగన్‌కు పట్టాదారు పాస్ పుస్తకాల గురించి తెలియనప్పుడే చంద్రబాబు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారని అన్నారు.
రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ భూముల వివరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా లేకుంటే మీ భూమి-నా భూమి అన్న జగన్ మాట నిజమవుతుందని హెచ్చరించారు. వేదికల మీద నీతి వాక్యాలు వల్లించడం కాదని, వైసీపీలోని కబ్జాకోరులు, కామాంధులు, బూతుబాబులను కట్టడి చేయాలని జగన్‌ను డిమాండ్ చేశారు.
అప్పుడు జనం.. ఇప్పుడు బారికేడ్లు
చంద్రబాబు హయాంలో రోడ్లకు ఇరువైపులా ప్రజలు బారులు తీరి కనిపిస్తే.. జగన్ పాలనలో రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు కనిపిస్తున్నాయని పట్టాభిరామ్ ఎద్దేవా చేశారు. ఏ వ్యక్తి అయితే తెలుగు బిడ్డలకు మంచి భవిష్యత్ కోసం పరితపిస్తాడో ఆయనను చంద్రబాబు అంటారని అన్నారు. జాకీ పరిశ్రమను తరిమేసి ప్రజలకు అండర్‌వేర్లు కూడా లేకుండా చేశారని జగన్‌పై ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ విషయంలో చేయాల్సిన దుర్మార్గాలు అన్నీ చేస్తూ మళ్లీ ఆయనతో పోల్చుకునే అర్హత ఎక్కడుందని జగన్‌ను నిలదీశారు. ప్రజలకు ఎప్పటికీ సుపరిపాలన అందించేది తెలుగుదేశమేనని పట్టాభిరామ్ స్పష్టం చేశారు.