West Bengal: పశ్చిమ బెంగాల్‌లో దారుణం: తండ్రిని చంపి.. తల్లి సాయంతో ముక్కలుగా కోసి విసిరేసిన కొడుకు!

mother and son duo kills father chops his body into pieces

  • పాలిటెక్నిక్ ఫీజు విషయంలో తండ్రీ కుమారుల మధ్య వాగ్వివాదం
  • కోపంతో నెట్టేయడంతో కుర్చీ తగిలి అపస్మారక స్థితిలోకి తండ్రి
  • ఆపై గొంతు నులిమి చంపేసిన కుమారుడు
  • మూడు రోజుల తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు

ఢిల్లీలో ఇటీవల సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసును మర్చిపోకముందే పశ్చిమ బెంగాల్‌లోనూ అలాంటి ఘటనే ఒకటి జరిగింది. తండ్రిని గొంతు నులిమి చంపేసిన కుమారుడు ఆపై తల్లి సాయంతో మృతదేహాన్ని ముక్కలుగా నరికి వాటిని సమీప ప్రాంతాల్లో విసిరేశాడు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బరూయ్‌పూర్‌ పరిధిలో జరిగిందీ ఘటన. 

పోలీసుల కథనం ప్రకారం.. నేవీ రిటైర్డ్ ఉద్యోగి ఉజ్వల్ చక్రవర్తి (55)కి పాలిటెక్నిక్ చదువుతున్న కుమారుడు జోయ్ చక్రవర్తి (25) ఉన్నాడు. ఈ నెల 12న పరీక్ష ఫీజు విషయంలో తండ్రీ కుమారుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన కుమారుడు తండ్రిని బలంగా నెట్టేశాడు. 

ఉజ్వల్ తలకు కుర్చీ తగలడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో తండ్రిని గొంతు నులిమి చంపేసిన కుమారుడు.. తల్లి శ్యామలితో కలిసి ఆయన మృతదేహాన్ని తన పాలిటెక్నిక్ కిట్‌లోని రంపంతో ఆరు ముక్కలుగా చేశాడు. అనంతరం వాటిని కవర్లలో చుట్టి తన సైకిల్‌పై తీసుకెళ్లి వేర్వేరు చోట్ల విసిరేశాడు.

ఆ తర్వాత మూడు రోజులకు తన భర్త కనిపించడం లేదంటూ కుమారుడితో కలిసి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఇద్దరి మాటల్లో తేడాను గుర్తించిన పోలీసులు గట్టిగా నిలదీయడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఉజ్వల్ చక్రవర్తి తమను చిత్రహింసలకు గురిచేస్తుండడంతో భరించలేక హత్య చేసినట్టు నిందితులిద్దరూ అంగీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు.

West Bengal
Joy Chakraborty
Aaftab Poonawala
Shraddha Walkar
  • Loading...

More Telugu News