Team India: సూర్య భాయ్ తగ్గేదేలే.. మెరుపు సెంచరీ కొట్టిన సూర్యకుమార్
- 49 బంతుల్లోనే శతకం సాధించిన వైనం
- న్యూజిలాండ్ తో రెండో టీ20లో భారత్ భారీ స్కోరు
- నిరాశ పరిచిన రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్
సూపర్ ఫామ్ లో ఉన్న ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి చెలరేగిపోయాడు. న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలింగ్ ను ఊచకొత కోస్తూ టీ20 కెరీర్ లో రెండో సెంచరీ చేశాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టీ20లో సూర్య కేవలం 49 బంతుల్లో శతకం సాధించాడు. మొత్తంగా 51 బంతుల్లోనే 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 111 పరుగులు చేశాడు. దాంతో, న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ లో భాగంగా ఆదివారం మౌంట్ మాంగనుయ్ లో మొదలైన రెండో మ్యాచ్ లో భారత్ ప్రత్యర్థి భారీ టార్గెట్ నిర్దేశించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 191/6 స్కోరు చేసింది. యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ (31 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్స్ తో 36) కూడా ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ రిషబ్ పంత్ 13 బంతులు ఆడి ఆరు పరుగులకే ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (13) హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. 6.4 ఓవర్లలో భారత్ 50/1 స్కోరు ఉన్న సమయంలో వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. తిరిగి మొదలైన తర్వాత సూర్యకుమార్ చెలరేగిపోయాడు. కాగా, చివరి ఓవర్లో పాండ్యా, దీపక్ హుడా, సుందర్ లను ఔట్ చేసిన టిమ్ సౌథీ హ్యాట్రిక్ సాధించాడు.
కాగా, ఈ జులైలో ఇంగ్లండ్ పై సూర్యకుమార్ తొలి శతకం సాధించాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తర్వాత ఈ ఫార్మాట్ లో రెండు, అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన భారత క్రికెటర్ గా నిలిచాడు. రోహిత్ ఖాతాలో నాలుగు శతకాలు ఉండగా.. కేఎల్ రాహుల్ రెండు సాధించాడు.