Bokaro Express: రిజర్వేషన్ విషయంలో ప్రయాణికుల మధ్య గొడవ.. అనకాపల్లి జిల్లాలో రెండు గంటలపాటు నిలిచిపోయిన బొకారో ఎక్స్‌ప్రెస్

Bokaro Express Halts for 2 hours in Anakapalle Dist Due to Passengers skirmish

  • రిజర్వేషన్ లేకుండానే రైలెక్కేసిన 500 మంది ప్రయాణికులు
  • అనకాపల్లిలో రైలెక్కి సీట్లను ఖాళీ చేయమన్న అయ్యప్ప భక్తులు
  • తాము టీసీకి డబ్బులిచ్చామని, సీట్లు ఖాళీ చేయబోమన్న ప్రయాణికులు
  • రేగులపాలెం వద్ద వారిని దించేయడంతో ఇంజిన్ ముందు బైఠాయించి నిరసన
  • పోలీసుల జోక్యంతో సద్దు మణిగిన వివాదం

రిజర్వేషన్ విషయంలో ప్రయాణికుల మధ్య తలెత్తిన గొడవ కారణంగా ధన్‌బాద్ నుంచి అలెప్పీ వెళ్లే బొకారో ఎక్స్‌ప్రెస్ అనకాపల్లి జిల్లాలో రెండు గంటలపాటు నిలిచిపోయింది. తుని రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. పనుల కోసం విజయవాడ వెళ్తున్న పశ్చిమ బెంగాల్, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌ రాష్ట్రాలకు చెందిన దాదాపు 500 మంది రిజర్వేషన్ చేయించుకోకుండానే రైలు ఎక్కారు. నిన్న ఉదయం 9.30 గంటల సమయంలో రైలు అనకాపల్లి చేరుకుంది. అక్కడ అయ్యప్ప భక్తులు రైలెక్కారు. 

తాము రిజర్వేషన్ చేసుకున్న సీట్లలో అప్పటికే  కూర్చున్న వారిని ఖాళీ చేయాలని కోరారు. అయితే, తాము టీసీకి డబ్బులు చెల్లించామని, సీట్లు ఖాళీ చేసేది లేదని తేల్చి చెప్పడంతో వారి మధ్య గొడవ జరిగింది. గొడవ జరుగుతుండగానే రైలు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగులపాలెం స్టేషన్‌కు చేరుకుంది. రైలులో ప్రయాణికుల గొడవ సమాచారం అందుకున్న అధికారులు అక్కడ రైలును నిలపివేసి రిజర్వేషన్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని కిందికి దించేశారు. 

దీంతో వారందరూ కలిసి రైలు ఇంజిన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న తుని రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. దాదాపు 400 మందిని ఖాళీగా ఉన్న ఇతర బోగీల్లో సర్దుబాటు చేశారు. దీంతో రైలు రెండు గంటలు ఆలస్యంగా అక్కడి నుంచి బయలుదేరింది. మిగిలిన 100 మంది ప్రయాణికులను తర్వాత వచ్చిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ పంపించారు.

  • Loading...

More Telugu News