smart phones: దేశంలో ఇకపై అన్ని స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ పరికరాలకు ఒకే రకమైన ఛార్జింగ్ పోర్టు
- ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
- టైప్–సి యూఎస్బీ పోర్టు అందుబాటులోకి తేనున్న కంపెనీలు
- ప్రస్తుతం వివిధ మోడళ్లకు వేర్వేరు పోర్టులు
దేశంలో చాలా కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లు, పరికరాలు వినియోగంలో ఉన్నాయి. ఒక్కో కంపెనీ ఫోనుకు ఒక్కో రకం ఛార్జర్ ను వాడుతున్నారు. వివిధ మోడళ్లకు రకరకాల ఛార్జింగ్ పోర్టులు ఉండటమే ఇందుకు కారణం.
అయితే, అన్ని రకాల ఫోన్లకు ఒకే రకమైన ఛార్జింగ్ పోర్టు ఉంటే బాగుంటుందని చాలా కాలంగా డిమాండ్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా దీనిపై చర్చ నడుస్తోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మన దేశంలో అందుబాటులో ఉండే స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ డివైజ్ లు ఒకే రకమైన ఛార్జింగ్ పోర్టు కలిగి ఉండాలని ఆదేశించింది. అన్నింటికీ టైప్–సి రకం యూఎస్బీ పోర్టు అందుబాటులోకి తీసుకురావాలి చెప్పింది.
ఈ మేరకు భారత ప్రభుత్వం... పలు కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఎలక్ట్రానిక్ పరిశ్రమల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దేశంలో ఒకే రకమైన ఛార్జింగ్ పోర్ట్ (టైప్ సి పోర్ట్) తీసుకురావాలన్న కేంద్ర వినియోదారుల వ్యవహారాల మంత్రి శాఖ ప్రతిపాదనకు ఆయా పరిశ్రమల ప్రతినిధులు అంగీకరించారు.
ఒకే ఛార్జింగ్ పోర్ట్ తో వినియోగదారుల సౌలభ్యం పెరగడంతో పాటు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు కూడా తగ్గుతాయి. అయితే, టైప్–సి పోర్టు ఎన్ని రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలనే దానిపై కేంద్రం నిర్ణీత గడువు విధించలేదు.
అయితే, ఒకటి రెండేళ్లలో యాపిల్ సహా అన్ని రకాల స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్స్, స్మార్ట్ వాచీలు, ఇతర స్మార్ట్ పరికరాల్లో టైప్ –సి ఛార్జింగ్ పోర్టులు ఉండనున్నాయి. తక్కువ ధర కలిగిన ఫీచర్ ఫోన్లకు ఒకే రకమైన ఛార్జింగ్ పోర్టుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.