Sunny Leone: కేరళ హైకోర్టును ఆశ్రయించిన సన్నీ లియోన్
- తనపై, తన భర్తపై చీటింగ్ కేసు కొట్టివేయాలని అభ్యర్థన
- ఓ ఈవెంట్ లో పాల్గొనలేదంటూ ఆమెపై కేసు నమోదు
- అవన్నీ అసత్యాలుగా పేర్కొన్న సన్నీలియోన్
బాలీవుడ్ నటి (గతంలో పోర్న్ స్టార్) సన్నీ లియోన్ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. తనపై, తన భర్త డానియల్ వెబెర్, తన ఉద్యోగి ఒకరిపై నమోదైన చీటింగ్ కేసును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. కేరళలోని ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఈవెంట్ మేనేజర్ శియాస్ కుంజు మహమ్మద్ దీన్ని దాఖలు చేశారు.
నాలుగేళ్ల క్రితం ఓ కార్యక్రమం (ఈవెంట్)లో పాల్గొనేందుకు సన్నీలియోన్ కు రూ.లక్షలు చెల్లించానని, అయినా ఆమె హాజరు కాలేదంటూ మహమ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సన్నీలియోన్, డానియల్ వెబెర్, వారి ఉద్యోగిపై సెక్షన్ 406, సెక్షన్ 420, సెక్షన్ 34 కింద అభియోగాలు నమోదు చేశారు. కానీ, ఇవన్నీ అసత్యాలని సన్నీ లియోన్ అంటోంది. తాను, తన భర్త, తన ఉద్యోగికి దీంతో ఎలాంటి సంబంధం లేదని, ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేవని పిటిషన్ లో తెలియజేసింది. పిటిషనర్ కు ఎలాంటి నష్టాలు రాలేదని పేర్కొంది. ఈ కేసు వల్ల తమ సాధారణ జీవితం ప్రభావితం అవుతోందని తెలిపింది.