password: మన దేశంలో ఎక్కువ మంది వాడుతున్న పాస్ వర్డ్ ఏదో తెలుసా?
- 3.5 లక్షల మంది ఉపయోగిస్తున్నది password
- 75,000 మందికి బిగ్ బాస్కెట్ పాస్ వర్డ్
- నంబర్లను పాస్ వర్డ్ గా పెట్టుకుంటున్నవారే ఎక్కువ
- బలహీన పాస్ వర్డ్ లతో హ్యాకింగ్ ముప్పు
పాస్ వర్డ్ అన్నది మన డేటాకు ప్రాథమిక రక్షణ. మన ఖాతాల్లోకి మరొకరు సులభంగా ప్రవేశించకుండా అడ్డుకునే మొదటి గేటు. అందుకే పాస్ వర్డ్ ను బలంగా సెట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయినా కానీ, కొంత మందికి పెద్ద పట్టింపు ఉండదు. సులభంగా గుర్తు ఉండే విధంగా ఎక్కువ ప్రచారంలో ఉన్న సంస్థలు, పదాలు, పేర్లను పెట్టుకుంటూ ఉంటారు. దీనివల్ల వారి ఖాతాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం లేకపోలేదు.
బలహీన పాస్ వర్డ్ లను హ్యాకర్లు సులభంగా చేధించగలరు. నార్డ్ పాస్ అనే సంస్థ 2022 సంవత్సరానికి సంబంధించి సాధారణ పాస్ వర్డ్ ల వివరాలను విడుదల చేసింది. ఆశ్చర్యకరంగా 3.5 లక్షల మంది password ను పాస్ వర్డ్ గా ఉపయోగిస్తున్నారు. నవ్వు తెప్పించే మరో విషయం.. బిగ్ బాస్కెట్ ను 75వేల మంది పాస్ వర్డ్ గా పెట్టుకున్నారు. ఇక ఎక్కువ మంది ఉపయోగించే టాప్-10 పాస్ వర్డ్ లలో.. 123456, 12345678, 123456789, pass@123, 1234567890, anmol123, abcd1234, googledummy ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో నార్డ్ పాస్ సర్వే నిర్వహించింది. గెస్ట్, వీఐపీ, 123456ను ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది పాస్ వర్డ్ కింద ఉపయోగిస్తున్నారు. ప్రచారంలో ఉన్న పేర్లను పాస్ వర్డ్ గా వాడుతున్నారని, వీటివల్ల హ్యాకర్ల పని సులభం అవుతుందని ఈ సంస్థ అంటోంది. ఎవరూ ఊహించలేని విధంగా, అక్షరాలు (క్యాపిటల్, స్మాల్), నంబర్లు, ప్రత్యేక క్యారెక్టర్లతో పాస్ వర్డ్ రూపొందించుకోవడం ద్వారా మంచి రక్షణ కల్పించుకోవచ్చన్నది నిపుణుల సూచన.