Super Star Krishna: కృష్ణ మృతిపై రాజకీయ, సినీ ప్రముఖుల సంతాపం

 Celebrities mourn Krishnas death

  • మనసున్న మనిషని కొనియాడని జగన్
  • సినిమాలతో సామాజిక స్పృహ కలిగించారన్న కేసీఆర్
  • తెలుగు పరిశ్రమకు సాంకేతికతను పరిచయం చేశారన్న జూనియర్ ఎన్టీఆర్

టాలీవుడ్ జేమ్స్‌బాండ్, సూపర్ స్టార్ కృష్ణ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. 

కృష్ణ స్ఫూర్తి అజరామరం: వెంకయ్య నాయుడు
సూపర్ స్టార్ కృష్ణ మృతికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. తెలుగు తెరపై కృష్ణ నింపిన స్ఫూర్తి అజరామరమని కొనియాడారు. సినిమాల్లోని ఆయన పాత్రలు యువశక్తికి చిహ్నంగా ఉండేవన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సినీ పరిశ్రమకు కృష్ణ సేవలు అమోఘం: ఏపీ గవర్నర్
నటుడిగా, నిర్మాతగా, నిర్మాణ సంస్థ అధినేతగా తెలుగు సినీ రంగానికి కృష్ణ అందించిన సేవలు మరువలేనివని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. 350కిపైగా సినిమాల్లో నటించిన కృష్ణ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సామాజిక స్పృహ కలిగించారు: కేసీఆర్
కృష్ణ తన సినిమాలతో ప్రజలకు సామాజిక స్పృహ కల్పించారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సాంఘిక చిత్రాలతో జనాదరణ సంపాదించుకున్నారని పేర్కొన్నారు. అప్పట్లో కార్మిక, కర్షక లోకం ఆయనను తమ అభిమాన హీరోగా, సూపర్ స్టార్‌గా కీర్తించేవారని గుర్తు చేసుకున్నారు. సొంత నిర్మాణ సంస్థ స్థాపించి దాని ద్వారా సినీ పరిశ్రమలో నూతన ఒరవడులు ప్రవేశపెట్టిన ఘనత ఆయనదేనని అన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మనసున్న మనిషి: జగన్
కృష్ణ మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆంధ్రా జేమ్స్‌బాండ్‌గా కృష్ణ కీర్తి గడించారని కొనియాడారు. నిజజీవితంలోనూ ఆయన మనసున్న మనిషని అన్నారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకే కాక, తెలుగు జాతికి కూడా తీరని లోటని అన్నారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.  

సాహసానికి మరో పేరు: జూనియర్ ఎన్టీఆర్
సాహసానికి మరో పేరే కృష్ణ అని టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణమైన పాత్రలే కాకుండా సాంకేతికంగానూ తెలుగు సినిమాకు ఎన్నో విధానాలను పరిచయం చేసిన ఘనత కృష్ణకే దక్కుతుందని అన్నారు. 

చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు: రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృష్ణ ఎంతగానో కృషి చేశారని కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన మృతికి సంతాపం తెలిపిన రేవంత్.. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. కృష్ణ మరణం సినీ రంగానికి తీరని లోటని అన్నారు.

Super Star Krishna
G.Krishna
Tollywood
Chiranjeevi
Venkaiah Naidu
Jr NTR
KCR
  • Loading...

More Telugu News