Kavya: హీరోయిన్ గా పరిచయమవుతున్న మరో చైల్డ్ ఆర్టిస్ట్!

Masooda Movie update

  • చైల్డ్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న కావ్య 
  • 'మసూద'లో ప్రధానమైన పాత్ర పోషణ 
  • హారర్ థ్రిల్లర్ నేపథ్యంతో నడిచే కథ  
  • ఈ నెల 18వ తేదీన సినిమా విడుదల

శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్టుగా వివిధ భాషల్లో నటించారు. తాను చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన హీరోల సరసనే హీరోయిన్ గాను మెప్పించారు. ఇటు సౌత్ లోను .. అటు నార్త్ లోను నెంబర్ వన్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు. ఆ తరువాత చైల్డ్ ఆర్టిస్టులలో ఎక్కువగా ప్రభావం చూపించిన ఆర్టిస్టుగా మీనా కనిపిస్తుంది. తెలుగు .. తమిళ భాషల్లో చైల్డ్ ఆర్టిస్టుగా .. హీరోయిన్ గా మీనా చక్రం తిప్పేశారు. 

వీళ్లలానే చైల్డ్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను ఆకట్టుకుంది కావ్య. ఆమె చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేసిందికానీ 'గంగోత్రి' సినిమా ఆమె కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ సినిమాలో తాను చేసిన 'వల్లంకి పిట్ట .. వల్లంకి పిట్ట' పాటను ఇప్పటికీ మరచిపోలేము. కావ్య పేరు జనాలకి గుర్తులేకపోయినా, 'వల్లంకి పిట్ట' పాటలో చేసిన అమ్మాయి అనగానే వెంటనే గుర్తుపట్టేస్తారు. అంతలా ఆ సినిమా చైల్డ్ ఆర్టిస్టుగా ఆమెకి పేరు తెచ్చిపెట్టింది. 

అలాంటి కావ్య 'మసూద' సినిమాలో ప్రధానమైన పాత్రను పోషించింది. సంగీత .. తిరు ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. సాధారణంగా ఎవరైనా లవ్ స్టోరీస్ ద్వారా కథానాయికగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలా కాకుండా హారర్ థ్రిల్లర్ సినిమా ద్వారా కావ్య పరిచయమవుతుండటం విశేషం. సాయి కిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక కథానాయికగా కావ్య బిజీ అవుతుందేమో చూడాలి.

More Telugu News