Rajiv Gandhi: ఉరితీసేందుకు ఏడుసార్లు ఆదేశాలు వచ్చాయి.. రాజీవ్ హత్య కేసు దోషి నళిని శ్రీహరన్
- ప్రతిసారీ జీవితం ముగిసిపోయిందనుకున్నానన్న నళిని
- ఏ క్షణంలోనైనా ఉరి తీయొచ్చని భయపడ్డానని వెల్లడి
- రాజీవ్ హత్యలో తన ప్రమేయం లేదని వివరణ
- ఆ రోజు ప్రియాంక గాంధీ ఏడ్చేశారన్న నళిని
రాజీవ్ గాంధీ హత్య కేసులో తన ప్రమేయం ఏమీలేదని నళిని శ్రీహరన్ మరోమారు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాజీవ్ హత్య కేసు దోషులంతా జైలు నుంచి బయటపడిన విషయం తెలిసిందే! ఈ సందర్భంగా ఆదివారం నళిని మీడియాతో మాట్లాడారు. జైలు జీవితం గురించి, ప్రియాంక గాంధీ తనను కలవడం గురించి వివరాలను పంచుకున్నారు. తన భర్త శ్రీహరన్ స్నేహితులతో తిరిగిన మాట వాస్తవమే అయినా వాళ్ల కుట్రలో తనకు సంబంధంలేదని వివరించారు.
కోర్టు తనను దోషిగా నిర్ధారించి, ఉరిశిక్ష వేశాక క్షణక్షణం భయంగా బతికానని నళిని తెలిపారు. ఉరిశిక్ష అమలుకు ఏడుసార్లు వారెంట్ అందిందని, ఇంతటితో తన జీవితం ముగిసిందని భయాందోళనలకు గురయ్యానని చెప్పారు. ‘కోర్టు నన్ను దోషిగా తేల్చింది కానీ హత్య కుట్రతో నాకు సంబంధంలేదు.. నిజమేమిటో నా అంతరాత్మకు తెలుసు’ అని నళిని వ్యాఖ్యానించారు. 2001 లో ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చేంత వరకు భయంభయంగానే బతికానని చెప్పారు.
ప్రియాంక గాంధీ దేవత..
రాజీవ్ గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ తనను కలిసిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘ప్రియాంక చాలా మంచి వ్యక్తి. ఆమె నిజంగా దేవతే. ఆ రోజు నన్ను కలవడానికి వచ్చినపుడు కూర్చోబెట్టి మాట్లాడారు. జైలు అధికారులు మమ్మల్ని కూర్చోనిచ్చేవాళ్లు కాదు.. కానీ ప్రియాంక నన్ను తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. తన తండ్రిని ఎందుకు చంపారని అడుగుతూ భావోద్వేగానికి లోనయ్యారు. అప్పుడామె ఏడ్చేశారు’ అని నళిని వివరించారు.
రెండేళ్ల వయసులో బిడ్డకు దూరమయ్యా..
జైలుకు వెళ్లే సమయంలో తను రెండు నెలల గర్భవతినని నళిని చెప్పారు. జైలులోనే బిడ్డకు జన్మనిచ్చానని, రెండేళ్ల వయసులో తనకు దూరమయ్యానని వివరించారు. 2019లో తన పెళ్లి సందర్భంగా నెల రోజుల పాటు పెరోల్ పై బయటకొచ్చానని నళిని తెలిపారు. ఇప్పుడు తన కూతురు హరిత్ర లండన్ లో డాక్టర్ గా పనిచేస్తోందని చెప్పారు. భర్తతో కలిసి కూతురును చూడడానికి వెళ్తానని నళిని పేర్కొన్నారు.