Srikakulam District: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కుమారుడు సహా పలాస ఆసుపత్రి సూపరింటెండెంట్ దుర్మరణం

Palasa Govt Hospital Superintendent Died In Road Accident
  • కుటుంబంతో కలిసి విశాఖ నుంచి కారులో పలాస వెళ్తుండగా ప్రమాదం
  • వంతెనపై రక్షణ గోడను ఢీకొని నుజ్జునుజ్జయిన కారు
  • తీవ్రంగా గాయపడిన భార్య, కుమార్తె
శ్రీకాకుళం జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వైద్యాధికారి, ఆయన కుమారుడు మృతి చెందగా భార్య, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. పలాస ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ మడే రమేశ్ (45).. ఆయన భార్య ప్రసన్న లక్ష్మి (45), కుమార్తె సైర్య (14), కుమారుడు సంకల్ప్ (10)తో కలిసి కారులో విశాఖపట్టణం నుంచి పలాసకు బయలుదేరారు. 

శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెదనాయుడుపేట వద్ద  జాతీయ రహదారిపై వారి కారు అదుపుతప్పి వంతెన రక్షణ గోడను బలంగా ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న రమేశ్, కుమారుడు సంకల్ప్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రసన్న లక్ష్మి, సైర్య తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన లక్ష్మి, సైర్యలను శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. నిద్ర మత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Srikakulam District
Road Accident
Palasa Govt Hospital

More Telugu News