Rajiv gandhi: హంతకుడిగానో, ఉగ్రవాదిగానో కాదు.. మమ్మల్ని బాధితులుగా చూడండి!
- ఉత్తర భారత ప్రజలకు రాజీవ్ హత్యకేసు దోషి విజ్ఞప్తి
- ఎవరు ఉగ్రవాది.. ఎవరు స్వాతంత్ర్య సమరయోధుడో కాలమే చెబుతుందని వ్యాఖ్య
- తమను అమాయకులని అదే కాలం తేల్చిందని వివరణ
రాజీవ్ హత్య కేసులో దోషులు ఆరుగురూ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే! ఆరుగురిలో ఒకరైన రవిచంద్రన్ జైలు బయట మీడియాతో మాట్లాడారు. మాజీ ప్రధాని హత్యకు తమకెలాంటి సంబంధంలేదని చెప్పారు. తమను ఉగ్రవాదులుగానో, హంతకులుగానో చూడొద్దని.. బాధితులుగా చూడాలని ఉత్తర భారత ప్రజలకు రవిచంద్రన్ విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదులు ఎవరు.. స్వాతంత్ర్య సమరయోధులెవరనేది కాలమే తేలుస్తుందని అన్నారు. ఉగ్రవాదులుగా ముద్రపడినప్పటికీ అదే కాలం తమను అమాయకులని తేల్చేసిందని వివరించారు.
తమిళుల కోసం, తమిళ ఉద్యమం కోసం పనిచేశామే తప్ప మాజీ ప్రధాని హత్యకు జరిగిన కుట్రలో తమకు సంబంధంలేదని రవిచంద్రన్ వివరణ ఇచ్చారు. మరణశిక్ష విధించేంత తప్పు తాము చేయలేదని చెప్పారు. కాగా, రాజీవ్ హత్య కేసులో దోషులుగా శిక్ష అనుభవిస్తున్న నళిని, శ్రీహరన్, రవిచంద్రన్.. సహా మొత్తం ఆరుగురిని విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఇటీవలే ఆరుగురు దోషులు జైలు నుంచి బయటకొచ్చారు. ఇక ఇది తమకు పునర్జన్మ అని నళిని వ్యాఖ్యానించారు. భర్త, కూతురితో మిగిలిన జీవితం గడిపేస్తానని ఆమె చెప్పారు.