Yogi Vemana University: యోగి వేమన యూనివర్శిటీలో వేమన విగ్రహం స్థానంలో వైఎస్సార్ విగ్రహం!
- 2006లో కడపలో యోగి వేమన యూనివర్శిటీ ఏర్పాటు
- అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు వేమన విగ్రహం ఏర్పాటు
- తాజాగా వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అధికారులు
జీవిత తత్వాన్ని సరళమైన భాషలో నిరక్షరాస్యులకు కూడా అర్థమయ్యే విధంగా పద్యాల రూపంలో చెప్పిన గొప్ప కవి యోగి వేమన. ప్రజాకవిగా పేరుగాంచిన ఆయన పేరుపై కడపలో యోగి వేమన యూనివర్శిటీని 2006లో వైఎస్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో నెలకొల్పారు. వేమన గొప్పతనాన్ని చాటేలా యూనివర్శిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
అయితే, ప్రస్తుతం అక్కడి అధికారులు వేమన విగ్రహాన్ని తొలగించి... వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని విద్యార్థి సంఘాల నేతలు చెప్పారు. వైఎస్ విగ్రహం కావాలనుకుంటే యూనివర్శిటీలోని వేరే ప్రదేశంలో పెట్టుకోవచ్చని... వేమన విగ్రహాన్ని తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ అంశంపై విపక్షాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం వేమన విగ్రహాన్ని యూనివర్శిటీ గేటు పక్కన ఉంచారు.