Rishab Shetty: 'కాంతార' కొత్త రికార్డు.. ఒక్క కర్ణాటకలోనే కోటికి పైగా టికెట్ల అమ్మకం!
- కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'కాంతార'
- ఇతర భాషల్లోను హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా
- తక్కువ బడ్జెట్ లో సొంతమైన భారీ లాభాలు
- అడవి నేపథ్యంలో నడిచిన కథాకథనాలు
- గిరిజనుల బలమైన విశ్వాసమే కథకి ప్రధానమైన బలం
'కాంతార' సెప్టెంబర్ 30వ తేదీన ఈ కన్నడ సినిమా విడుదలైంది. హీరోగా .. దర్శకుడిగా రిషబ్ శెట్టికి పేరుంది గానీ, ఈ సినిమాపై ఈ స్థాయి అంచనాలు ఉండేవి కాదు. రిలీజ్ కి ముందు మాత్రమే బజ్ పెరుగుతూ వెళ్లింది. తొలి ఆటతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా, ఇక ఆ తరువాత బ్లాక్ బస్టర్ హిట్ వైపు పరుగులు తీయడం మొదలైంది. ఈ క్రమంలోనే తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో థియేటర్లను పలకరించింది.
కన్నడ రిలీజ్ తరువాత దాదాపు 15 రోజులకు ఇతర భాషల్లో విడుదలైన ఈ సినిమా, అక్కడ కూడా తన సత్తాను చాటుకుంది. కేవలం 16 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా 200 కోట్లను కొల్లగొట్టిన సినిమాగా నిలిచింది. అలాంటి ఈ సినిమా తాజాగా మరో రికార్టును సొంతం చేసుకుంది. ఒక్క కర్ణాటకలోనే కోటికి పైగా టిక్కెట్లు అమ్ముడైనట్టుగా చెబుతూ, మేకర్స్ ఒక పోస్టర్ ను వదిలారు.
ఇది కర్ణాటక ప్రాంతంలో .. ఒక గిరిజన గూడెం నేపథ్యంలో నడిచిన కథ. అక్కడి ఆచారవ్యవహారాలను .. విశ్వాసాలను కలుపుకుంటూ ఈ కథ నడుస్తుంది. అన్ని పాత్రలు అడవిలోకి వస్తాయి తప్ప, అడవిని దాటి ఏ పాత్ర బయటికి వెళ్లదు. అడవి సాక్షిగానే కథ నడుస్తూ ఉంటుంది. తక్కువ బడ్జెట్ లో నిర్మితమై ఈ స్థాయి లాభాలను అందుకున్న సినిమా, ఈ మధ్య కాలంలో ఇదేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.