Ukraine: ఉక్రెయిన్ సిటీ నుంచి తమ బలగాలను ఖాళీ చేయిస్తున్న రష్యా

Russia Orders Retreat From Ukraine Kherson City In Major Setback

  • బలగాలను వాపస్ పిలిపిస్తున్న వైనం
  • తమ సైనికుల ప్రాణాలే తమకు ముఖ్యమని వెల్లడి
  • జాగ్రత్తగా తిరిగి రావాలంటూ సైనికులకు రష్యా రక్షణ మంత్రి పిలుపు
  • ఖేర్సన్ పై ఉక్రెయిన్ జెండా ఎగిరినప్పుడే నమ్ముతాం: జెలెన్ స్కీ

నెలల తరబడి కొనసాగుతున్న ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో కీలక మలుపు చోటుచేసుకుంది. దూకుడుగా ఉక్రెయిన్ లోకి చొచ్చుకెళ్లి నాలుగు నగరాలను ఆక్రమించిన రష్యా బలగాలు తాజాగా వెనక్కి తగ్గాయి. ఉక్రెయిన్ కు చెందిన ఖేర్సన్ నగరం నుంచి వెనక్కి వచ్చేస్తున్నాయి. తమ సైనికుల ఆరోగ్యం, ప్రాణాలకే తమ ప్రాధాన్యమని, అందుకోసమే ఖేర్సన్ నుంచి వైదొలుగుతున్నామని రష్యా రక్షణ మంత్రి సెర్గెయ్ షొయిగు స్పష్టం చేశారు.

ఇటీవల ఉక్రెయిన్ లో ఆక్రమించుకున్న నాలుగు నగరాలను రష్యా తమ దేశంలో కలిపేసుకున్న విషయం తెలిసిందే! రెఫరెండం నిర్వహించి మరీ ఈ నాలుగు నగరాలను శాశ్వతంగా కలిపేసుకుంది. అక్కడ రష్యా బలగాలను మోహరించి, తమ నగరాలపై దాడులు చేస్తే అణుదాడికీ వెనకాడబోమని ఉక్రెయిన్ ను హెచ్చరించింది. ఆ నాలుగు నగరాలలో ఖేర్సన్ కూడా ఒకటి. 

కీలకమైన ఈ నగరంపై పట్టుకోసం రెండు దేశాలు పోరాడుతున్నాయి. ఇందులో ఉక్రెయిన్ దే కాస్త పైచేయి కావడం, తమ బలగాల ప్రాణనష్టం ఎక్కువగా ఉండడంతో రష్యా పునరాలోచనలో పడింది. చివరకు ఖేర్సన్ ను వదిలేయాలని నిర్ణయించింది. సైనికులు అందరూ క్షేమంగా తిరిగొచ్చేలా చూసుకోవాలని, ఆయుధాలనూ జాగ్రత్తగా వెనక్కి తేవాలని షొయిగు తన కమాండర్లను ఆదేశించారు.

ఖేర్సన్ నుంచి రష్యా బలగాలు వాపస్ వెళ్లిపోతున్నాయనే వార్తలను ఉక్రెయిన్ పూర్తిగా విశ్వసించట్లేదు. ఇప్పటికీ ఖేర్సన్ లో రష్యన్ బలగాలు పహారా కాస్తున్నాయని, కొంతమంది మాత్రమే వెనక్కి వెళ్లిపోతున్నారని పేర్కొంది. సిటీలోకి మరింత మంది సైనికులను పంపించేందుకు రష్యా ప్లాన్ చేస్తోందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ ఆరోపిస్తున్నారు. ఖేర్సన్ పై ఉక్రెయిన్ జెండా ఎగరవేశాక మాత్రమే తమకు నమ్మకం కలుగుతుంది తప్ప రష్యా ప్రకటనలను నమ్మబోమని చెప్పారు. ఈమేరకు బుధవారం రాత్రి తమ బలగాలను ఉద్దేశించి మాట్లాడిన వీడియోలో జెలెన్ స్కీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News