Karnataka: హాల్ టికెట్ పై సన్నీలియోన్ ఫొటో.. కర్ణాటక టెట్ అభ్యర్థి షాక్!

Actor Sunny Leone Photo Seen On Entrance Test Admit Card

  • సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రిన్సిపాల్
  • విద్యాశాఖ ప్రమేయం లేదన్న అధికారులు
  • అభ్యర్థి అప్ లోడ్ చేసిన ఫొటోనే హాల్ టికెట్ పై వస్తుందని వివరణ
  • తన తరఫున వేరొకరు దరఖాస్తు చేశారని సదరు అభ్యర్థి వెల్లడి

కర్ణాటకలో ఇటీవల జరిగిన టెట్ పరీక్ష సందర్భంగా వింత ఘటన జరిగింది. పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ అభ్యర్థిని హాల్ టికెట్ చూసి అధికారులు అవాక్కయ్యారు. ఆపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు అభ్యర్థిని హాల్ టికెట్ పై బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఫొటో ఉండడమే దీనికి కారణం.

ఈ నెల 9న కర్ణాటక టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్(టెట్ 2022) జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాశారు. శివమొగ్గలోని రుద్రప్ప కాలేజీలో పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ అభ్యర్థిని హాల్ టికెట్ పై ఇన్విజిలేటర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ హాల్ టికెట్ లో అభ్యర్థి ఫొటో ఉండాల్సిన చోట సన్నీలియోన్ ఫొటో ఉండడంతో లోపలికి అనుమతించలేదు. కాలేజ్ ప్రిన్సిపాల్ ను కలిసి విజ్ఞప్తి చేయడంతో పరీక్షకు అనుమతించారు. కాగా, ఈ వ్యవహారంలో తప్పు ఎక్కడ జరిగిందనేది కనిపెట్టి, అందుకు కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

మరోపక్క, హాల్ టికెట్ పై సన్నీలియోన్ ఫొటో వ్యవహారంపై రుద్రప్ప కాలేజీ ప్రిన్సిపాల్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యాశాఖ అధికారులు మాత్రం ఇందులో తమ డిపార్ట్ మెంట్ తప్పేమీలేదని చెప్పారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థి అప్ లోడ్ చేసిన ఫొటోతో ఆటోమేటిక్ గా హాల్ టికెట్ జనరేట్ అవుతుందని వివరణ ఇచ్చారు. ఇదే విషయంపై సదరు అభ్యర్థిని ప్రశ్నించగా.. టెట్ దరఖాస్తు తాను స్వయంగా చేయలేదని, మరొకరితో చెప్పి చేయించుకున్నట్లు తెలిపారు.

దరఖాస్తు ప్రక్రియను అభ్యర్థులే స్వయంగా పూర్తిచేయాలని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్క టెట్ మాత్రమే కాదు.. ఏ ప్రవేశ పరీక్ష అయినా సరే దరఖాస్తును అభ్యర్థి మాత్రమే చేయాలని సూచించారు. దరఖాస్తు సమయంలో వచ్చే పాస్ వర్డ్ లు, ఓటీపీల వివరాలను ఇతరులకు చెప్పొద్దని హెచ్చరించారు.

Karnataka
tet
hall ticket
Sunny Leone
exam
  • Loading...

More Telugu News