Nitin Gadkari: దేశం ఆయనకు రుణపడి ఉంటుంది: మన్మోహన్ సింగ్ పై నితిన్ గడ్కరీ ప్రశంసలు
- మన్మోహన్ ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక గతిని మార్చేశాయన్న గడ్కరీ
- భారత్ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు దోహదపడ్డాయని కితాబు
- ఉదారవాద ఆర్థిక విధానం రైతులు, పేదల కోసమేనని వ్యాఖ్య
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలి కాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీ అధిష్ఠానాన్ని కూడా ఇబ్బందులకు గురి చేశాయి. తాజాగా ఆయన మరోసారి పార్టీలకు అతీతంగా తన మనసులోని మాటను బయటపెట్టారు. మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ ను ఆయన ఆకాశానికెత్తేశారు. దేశ ఆర్థిక గతిని మార్చిన మేధావి మన్మోహన్ సింగ్ అని... దేశం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుందని కొనియాడారు. టీఐఓఎల్ (ట్యాక్స్ ఇండియా ఆన్ లైన్) అవార్డ్స్ 2022 కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశ ఆర్థిక మంత్రిగా 1991లో మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలను ప్రారంభించారని... ఆయన చేపట్టిన చర్యలతో దేశ ఆర్థిక వ్యవస్థ సరికొత్త మార్గంలో పయనించి, భారత్ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు దోహదపడిందని గడ్కరీ ప్రశంసించారు. 1990 దశకం మధ్యలో తాను మహారాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు... రాష్ట్రంలో రోడ్లు వేయడానికి నిధులను సమీకరించగలిగానని... ఇది మన్మోహన్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వల్లే సాధ్యమయిందని తెలిపారు.
ఉదారవాద ఆర్థిక విధానం అనేది రైతులు, పేద ప్రజలకోసమని గడ్కరీ అన్నారు. ఈ ఆర్థిక విధానం ఒక దేశాన్ని అభివృద్ధి దిశగా ఎలా తీసుకుపోతుందో చెప్పడానికి చైనా పెద్ద ఉదాహరణ అని చెప్పారు. ప్రస్తుతం తన శాఖ దేశ వ్యాప్తంగా 26 గ్రీన్ ఎక్స్ ప్రెస్ వేలను నిర్మిస్తోందని... తమకు నిధుల కొరత లేదని తెలిపారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆదాయం ఏడాదికి రూ. 40 వేల కోట్లుగా ఉందని... 2024 చివరికల్లా ఇది రూ. 1.40 కోట్లకు చేరుకుంటుందని చెప్పారు.