Meera Kuntal: స్టూడెంట్ ను పెళ్లాడేందుకు లింగ మార్పిడి చేయించుకున్న టీచర్

PET changes gender to marry student

  • రాజస్థాన్ లో ఘటన
  • ఓ స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్న మీరా
  • అదే స్కూల్లో చదువుతున్న కల్పన
  • ఇద్దరి మధ్య ప్రేమ
  • లింగమార్పిడితో ఆరవ్ గా మారిన మీరా

ఓ స్కూలు టీచర్ తన స్టూడెంట్ ను పెళ్లాడేందుకు లింగ మార్పిడి చేయించుకున్న ఆశ్చర్యకరమైన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. మీరా కుంతల్ భరత్ పూర్ లోని ఓ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తోంది. అదే స్కూల్లో చదువుతున్న కల్పనా ఫౌజ్దార్ అనే అమ్మాయితో మీరా ప్రేమలో పడింది. కల్పనతో జీవితం పంచుకోవాలని బలంగా నిశ్చయించుకున్న మీరా... ఎంతో రిస్క్ తీసుకుని లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని పురుషుడిగా మారింది. 

ఇప్పుడామె ఆమె కాదు... అతడు... పేరు ఆరవ్ కుంతల్. ఇటీవలే ఆరవ్, కల్పనల వివాహం జరిగింది. స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసుల సందర్భంగా ఏర్పడిన పరిచయం మీరా (ఆరవ్), కల్పనల మధ్య ప్రేమకు దారితీసింది. 

కల్పన రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడాకారిణి. దుబాయ్ లో జనవరిలో జరిగిన అంతర్జాతీయ కబడ్డీ టోర్నమెంట్ లోనూ పాల్గొంది. 

లింగమార్పిడి అనంతరం కల్పనను పెళ్లాడిన ఆరవ్ మీడియాతో మాట్లాడుతూ, అమ్మాయిగా పుట్టినప్పటికీ తాను అబ్బాయిగా మారాలని ఎల్లప్పుడూ అనుకునేవాడ్నని తెలిపాడు. అబ్బాయిగా మారే క్రమంలో తొలి సర్జరీ 2019లో చేయించుకున్నానని వెల్లడించాడు. 

ఇక కల్పన స్పందిస్తూ, ఆరవ్ తో చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నానని, లింగ మార్పిడి చేయించుకోకపోయినా అతడినే పెళ్లి చేసుకునేదాన్నని తెలిపింది. కాగా, వీరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు అంగీకరించడం విశేషం.

Meera Kuntal
Kalpana Fouzdar
Aarav Kuntal
Gender Change
Rajasthan

More Telugu News