USA: రిపబ్లికన్లకు ఓటేయండి.. అమెరికన్లకు మస్క్ పిలుపు
- స్వతంత్ర ఓటర్లే కీలకమని మస్క్ ట్వీట్
- అమెరికా మధ్యంతర ఎన్నికలలో భాగంగా నేడు పోలింగ్
- ముందస్తు ఆప్షన్ తో ఇప్పటికే ఓటేసిన 4 కోట్ల మంది అమెరికన్లు
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఓటేయాలంటూ అక్కడి పౌరులకు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ పిలుపునిచ్చారు. దీనివల్ల దేశంలోని రెండు పార్టీల మధ్య అధికారం సమతుల్యంగా ఉంటుందని చెప్పారు. డెమోక్రాట్ లీడర్ జో బైడెన్ ను ప్రెసిడెంట్ సీటులో కూర్చోబెట్టిన నేపథ్యంలో ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్ లో రిపబ్లికన్లకు మెజారిటీ కల్పించాలని పేర్కొన్నారు. అధికారం ఎప్పుడూ ఒక్కరి చేతుల్లోనే కేంద్రీకృతం కావడం మంచిది కాదని మస్క్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని మస్క్ సోమవారం ట్వీట్ చేశారు. మంగళవారం అమెరికాలో పోలింగ్ జరగనుంది. ముందస్తు ఓటింగ్ విధానం ద్వారా ఇప్పటికే 4 కోట్ల మంది అమెరికన్లు ఓటేశారు.
డెమోక్రాటిక్ పార్టీ అభిమానులు కానీ, రిపబ్లికన్ పార్టీ అభిమానులు కానీ తమ పార్టీని కాదని వేరే వాళ్లకు ఓటేసే పరిస్థితి లేదు.. ఈ పరిస్థితిలో ఏ పార్టీకి చెందని ఓట్లు కీలకమని అన్నారు. ఈ ఓట్లే పార్టీల జయాపజయాలను నిర్ణయిస్తాయని వివరించారు. అంటే అమెరికన్ కాంగ్రెస్ లో ఏ పార్టీ మెజారిటీ సాధించాలో నిర్ణయించేది స్వతంత్రుల ఓట్లేనని స్పష్టం చేశారు. అలాంటి ఏ పార్టీకి చెందని ఓటర్లు రిపబ్లికన్లకు ఓటేయాలని మస్క్ కోరారు.
అమెరికన్ కాంగ్రెస్ కు మంగళవారం మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. డెమోక్రటిక్ పార్టీ తరఫున ప్రెసిడెంట్ బైడెన్, మాజీ ప్రెసిడెంట్ ఒబామా తదితరులు విస్తృతంగా ప్రచారం చేయగా.. రిపబ్లికన్ల తరఫున మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే రిపబ్లికన్లకు ఓటేయాలంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.