Lakshanrao Jarkiholi: 'హిందూ' అనే పదం పర్షియాకు చెందినది... భారతదేశంతో ఈ పదానికి ఏమిటి సంబంధం?: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్
- సంచలన వ్యాఖ్యలు చేసిన జర్కిహోళి
- హిందూ అంటూ భయానకం అని అర్థమని వెల్లడి
- ఈ పదానికి గొప్పదనం ఆపాదిస్తున్నారని విమర్శలు
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ రావు జర్కిహోళి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'హిందూ' అనే పదం పర్షియాకు చెందినదని, ఈ పదంతో భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. 'హిందూ' అనే పదానికి పర్షియన్ భాషలో 'భయానకం' అని అర్థమని వివరించారు.
'హిందూ' అనే పదం ఎక్కడ్నించి వచ్చింది? దీనికి భారతదేశంతో ఏమిటి సంబంధం? వికీపీడియాలో కానీ, వాట్సాప్ లో కానీ వెతుక్కోండి... 'హిందూ' అనే పదానికి అర్థం ఏమిటో తెలుస్తుంది. ఈ పదానికి ఎందుకింత గొప్పదనాన్ని ఆపాదిస్తున్నారు? అని లక్ష్మణ్ రావు జర్కిహోళి ప్రశ్నించారు.
బెళగావి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కాగా, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యలను సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండించారు. హిందూ అనేది ఓ జీవన విధానం అని, నాగరికతకు వాస్తవరూపం అని అభివర్ణించారు. ప్రతి మతాన్ని, మత విశ్వాసాలను గౌరవిస్తూ కాంగ్రెస్ పార్టీ నాడు భారత్ నిర్మాణం చేపట్టిందని వివరించారు. ఈ మేరకు నష్ట నివారణ వ్యాఖ్యలు చేశారు.