Sunil Gavaskar: అతడు లేకపోతే భారత్ 150 పరుగులు కూడా చేయలేదు: గవాస్కర్

Gavaskar heaps praise on Suryakumar Yadav

  • సూర్యకుమార్ యాదవ్ పై గవాస్కర్ ప్రశంసలు
  • మిస్టర్ 360 అంటూ ప్రశంసలు
  • అతడు కొట్టలేని షాట్ అంటూ ఏదీ లేదని కితాబు

లేటు వయసులో జట్టులోకి వచ్చినా ధాటిగా ఆడుతూ బౌలర్లకు సింహస్వప్నంలా మారిన క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్. ప్రస్తుతం సూర్యకుమార్ ఆడుతున్న ఇన్నింగ్స్ లు చూస్తే అతడు 30 ఏళ్లకు పైబడినవాడని ఎవరూ అనుకోరు. మైదానంలో ఏ మూలకైనా షాట్లు కొట్టగలిగే టెక్నిక్, భుజబలం అతడి సొంతం. ఆఫ్ సైడ్ బంతులను కూడా డీప్ ఫైన్ లెగ్ దిశగా సిక్సర్లు కొట్టే సూర్య, స్కూప్ షాట్లకు పెట్టింది పేరు. 

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లోనూ సూర్యకుమార్ యాదవ్ జోరు కొనసాగుతోంది. నెదర్లాండ్స్ పై 51 నాటౌట్, సౌతాఫ్రికాపై 68, బంగ్లాదేశ్ పై 30, జింబాబ్వే 61 నాటౌట్... ఈ మెగా టోర్నీలో సూర్య ఫామ్ కు ఈ గణాంకాలే నిదర్శనం. 

ఈ నేపథ్యంలో, భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్... సూర్యకుమార్ యాదవ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ నూతన మిస్టర్ 360 అని కితాబునిచ్చారు. అతడు జట్టులో లేకపోయినా, అతడు విఫలమైనా టీమిండియా 140-150 పరుగులు చేయడానికి కూడా ఇబ్బందిపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ వరల్డ్ కప్ లో అతడు ఆడిన ప్రతి ఇన్నింగ్స్ దాదాపు 360 డిగ్రీల కోణంలో సాగిందేనని గవాస్కర్ వివరించారు. 

వికెట్ కీపర్ పక్క నుంచి సిక్స్ కొట్టడం సూర్యకుమార్ యాదవ్ కే చెల్లిందని కొనియాడారు. ఫైనల్ ఓవర్లలో బౌలర్లను లక్ష్యంగా చేసుకుని స్క్వేర్ లెగ్ వైపు బంతిని స్టాండ్స్ లోకి పంపడం అతడి ప్రతిభకు నిదర్శనం అని ప్రశంసించారు. సూర్యకుమార్ యాదవ్ కొట్టలేని షాట్ అంటూ ఏదీ లేదని, అతడి అమ్ములపొదిలో అన్నిరకాల అస్త్రాలు ఉన్నాయని తెలిపారు. సూర్యకుమార్ కారణంగానే టీమిండియా భారీ స్కోర్లు సాధిస్తోందని అన్నారు.

  • Loading...

More Telugu News